విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం

తొలగించిన మనిషి కాలు కుక్క తినడం హేయం

దేవినేని అవినాష్‌ ధ్వజం

తొలగించిన మనిషి కాలును కుక్క తింటున్న విషయం వెలుగులోకి వచ్చి, తీవ్ర కలకలం రేగిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని ఎన్టీఆర్‌ జిల్లా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ సందర్శించారు. ఆస్పత్రిలో దుర్భర పరిస్థితులను చూసిన తర్వాత, పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

దారుణ స్థితిగతుల్లో ప్రభుత్వ ఆస్పత్రులు

వైద్యం కోసం వెళ్లాలంటే రోగులు భయపడుతున్నారు

పేరుకే విజయవాడ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

అక్కడ వెంటిలేటర్లు, ఏసీలు, కనీస సౌకర్యాలు లేవు

హెల్పర్లు లేక రోగుల అటెండెంట్లు స్ట్రెచర్లపై తరలిస్తున్నారు

ఆరోగ్యశ్రీ లేక పేద రోగుల నానా ఇక్కట్లు

ప్రభుత్వ నిర్లక్ష్యంపై దేవినేని అవినాష్‌ మండిపాటు

విజయవాడ: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగికి తొలగించిన కాలును కుక్క తిన్న ఘటన అమానవీయమని వైయస్‌ఆర్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రిలో రోగి అవయవాన్ని కుక్కలు పీక్కుతినే స్థితి రావడం రాష్ట్ర వైద్యవ్యవస్థ పతనానికి నిదర్శనమని ఆక్షేపించారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రభుత్వాసుపత్రుల్లో కనీస సౌకర్యాలు, భద్రత, పారిశుధ్య చర్యలు కూడా లేకపోవడం దారుణమని మండిపడ్డారు.
    విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి బాధిత రోగిని పరామర్శించిన అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం, వైద్యశాఖ మంత్రి ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
ప్రెస్‌మీట్‌లో దేవినేని అవినాష్‌ ఏమన్నారంటే..:

సీఎం, మంత్రులు ఏమయ్యారు?:
    విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగికి తీసేసిన కాలును కుక్క పీక్కుతినడం, ఆక్సిజన్‌ ప్లాంట్‌ వద్ద కాలు తింటూ కనిపించడం రాష్ట్ర వైద్యవ్యవస్థ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ ఘటనతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సామాన్య ప్రజలు ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వైద్యశాఖ మంత్రి ఏమయ్యారు? నోరు తెరిస్తే చాలు ఢిల్లీ, బీజేపీ అంటూ గొప్పలు చెప్పుకునే వైద్యశాఖ మంత్రి ఈ ఘటనపై ఏమి సమాధానం చెబుతారు?  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు వైద్య రంగం కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. రెండేళ్లుగా విజయవాడ ఆసుపత్రికి వెంటిలేటర్లు కావాలని వైద్యులు బతిమాలుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. దాదాపు 100 వెంటిలేటర్లు అవసరమని కోరితే కనీసం 25 కూడా ఏర్పాటు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.

మీకు ఓట్లు వేసి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు:
    విజయవాడ సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో ఏసీలు పని చేయడం లేదు. వాటికి కనీస మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో పేషెంట్లు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆపరేషన్‌ థియేటర్లలో కూడా ఏసీలు పని చేయడం లేదు. సరైన సౌకర్యాలు లేక ప్రజలకు మెరుగైన వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు చంద్రబాబు అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు. లోకేష్‌ ఏ దేశంలో ఉంటారో కూడా ఎవరికీ తెలియదు. కానీ మీకు ఓట్లు వేసిన ప్రజలు మాత్రం ఆసుపత్రుల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 
    ఆసుపత్రిలో పని చేసే ఉద్యోగులు, క్లీనింగ్‌ స్టాఫ్, హెల్పర్లను నియమించడం లేదు. ఒక బ్లాక్‌ నుంచి మరో బ్లాక్‌కు పేషెంట్‌ను తరలించాలంటే కుటుంబ సభ్యులే స్ట్రెచర్‌పై తీసుకెళ్లాల్సిన దారుణ పరిస్థితి ప్రభుత్వాసుపత్రుల్లో కనిపిస్తోంది.

వైయస్‌ జగన్‌ను చూసి నేర్చుకొండి:
    జగన్‌గారు తన పాలనలో వైద్యశాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా కుక్కలు, ఎలుకలు పేషెంట్ల అవయవాలు తిన్న ఘటనలు జరగలేదు. 2014–2019లో ఎలుకల బాధ ఉండేది.. ఇప్పుడు 2024 నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో కుక్కలు పేషెంట్ల అవయవాలు తింటున్న దారుణ పరిస్థితి నెలకొంది. గుండె బైపాస్‌ సర్జరీలు చేయించుకోవాలంటే విజయవాడ ప్రజలు గుంటూరుకు వెళ్లాల్సి వస్తోంది. విజయవాడ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 40 ఏళ్ల అనుభవం ఉందంటూ దేశమంతా తిరుగుతూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. రాష్ట్రంలోని పేదలకు కనీస వైద్యం కూడా అందించలేకపోతున్నారు. ఇదేనా మీ అనుభవం?.

ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలి:
    గత పాలనకు, ఈ పాలనకు చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు సరిగా అమలు కావడం లేదు. సామాన్య ప్రజలు వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి నీచమైన పరిపాలన చంద్రబాబు తప్ప మరెవ్వరూ చేయలేరు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలి. షో రాజకీయాలు మానేసి పేదలకు సక్రమంగా వైద్యసేవలు అందించేలా పాలన చేయాలి. ప్రభుత్వాసుపత్రుల్లో కనీసం ఫ్యాన్లు కూడా పని చేయడం లేదు. వెంటనే హెల్పర్లను నియమించి, సూపర్‌వైజర్లు బాధ్యతగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని దేవినేని అవినాష్‌ కోరారు.

Back to Top