తాడేపల్లి: గోదావరి జిల్లాలు నేడు పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నాయంటే అందుకు ప్రధాన కారణం సర్ ఆర్థర్ కాటన్ చేసిన సేవలేనని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశం విడుదల చేశారు. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించి సముద్రంలో కలిసిపోతున్న గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని వైయస్ జగన్ కొనియాడారు. ఆయన నిర్మించిన ఆనకట్ట వల్ల లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, తాగునీటి అవసరాలు కూడా తీరాయని గుర్తుచేశారు. వ్యవసాయ రంగం, నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధికి సర్ ఆర్థర్ కాటన్ చేసిన కృషిని ఎప్పటికీ మరువలేమని వైయస్ జగన్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఆయన చూపిన దూరదృష్టి తరతరాలకు ఆదర్శమని అన్నారు.