తిరుపతి: రాష్ట్రంలో మద్యం నియంత్రణ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, డ్రగ్స్ నియంత్రణ మరియు మహిళల భద్రత విషయంలో మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుతం తమిళనాడు సీఎం విజయ్ కూడా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మద్యం నియంత్రణపై కఠిన చర్యలు తీసుకుంటేనే మహిళల భద్రత, యువత భవిష్యత్తు కాపాడబడుతుందని అన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్య అవసరాన్ని చాలా ముందుగానే గుర్తించిన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని నారాయణస్వామి తెలిపారు. ఆయన హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం అమలు చేశారని గుర్తుచేశారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీలో ఇంగ్లీష్ మీడియం విద్యను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌ను తగ్గించుకోవడంతో పాటు స్పెషల్ ఫ్లైట్స్ వినియోగాన్ని కూడా తగ్గించాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నారాయణస్వామి పేర్కొన్నారు.