గుంటూరు: పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో నెలకొన్న పరిస్థితులపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతులపై దాడులు చేయించడం, మహిళలు సహా రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించడం దారుణమని విమర్శించారు. పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో మాజీ మంత్రి పేర్ని నాని పర్యటించారు. వారం రోజుల క్రితం మొక్కజొన్న రైతులపై జరిగిన దాడి ఘటనలో బాధితులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు బయట గ్రామాల నుంచి వచ్చి తమ గోడౌన్‌పై దాడి చేశారని, తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం తమపైనే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని వాపోయారు. బాధిత రైతులతో మాట్లాడిన పేర్ని నాని ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీజ్ చేసిన మొక్కజొన్న గోడౌన్‌ను పరిశీలించారు. రైతులకు న్యాయం జరిగేలా పోరాడతామని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. మామిళ్లపల్లిలో బాధిత రైతులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని, “మట్టి అమ్ముకునేవాళ్లు, మర్డర్లు చేసే వాళ్లను ధూళిపాళ్ల నరేంద్ర గ్రామానికి పంపించి రైతులపై దాడులు చేయిస్తారా?” అని ప్రశ్నించారు. ఆడ, మగ తేడా లేకుండా మొక్కజొన్న రైతులపై తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు కూడా ఇలాంటి ఘటనలపై లోలోపల బాధపడుతున్నారని అన్నారు. “30 ఏళ్లు నీకు జెండా మోసిన కాపులపైనే దాడులు చేయిస్తావా?” అంటూ ధూళిపాళ్ల నరేంద్రను ప్రశ్నించారు. సంగం డెయిరీ వ్యవహారంపైనా పేర్ని నాని పలు ఆరోపణలు చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో గేదె పాలు సేకరించి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి అమ్ముతున్నారని, “గేదె పాలతో ఆవు నెయ్యి ఎలా వస్తుందో అర్థం కావడం లేదు” అని వ్యాఖ్యానించారు. సంగం డెయిరీ, వైష్ణవి డెయిరీ ఒకటే కాదా అని ప్రశ్నిస్తూ, వైష్ణవి డెయిరీ తప్పు చేసిందని సీబీఐ చెప్పిందని పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోలు వ్యవహారంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. క్వింటా మొక్కజొన్నను రూ.1600కు కొనుగోలు చేసి, సంగం డెయిరీలో మాత్రం రూ.2100కు కొన్నట్లు రికార్డులు సృష్టిస్తున్నారని అన్నారు. ధూళిపాళ్ల నరేంద్రకు సంగం డెయిరీ అంటే ప్రాణమని, ఆయన చేత చైర్మన్ పదవికి రాజీనామా చేయించడం చంద్రబాబుకే సాధ్యం కాలేదని వ్యాఖ్యానించారు. కాపు సామాజికవర్గాన్ని ఉద్దేశించి కూడా పేర్ని నాని మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌ను నమ్మి కూటమికి ఓటేస్తే ఇప్పుడు కాపులపైనే దాడులు జరుగుతున్నాయని, అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు పంట కొనుగోలు చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. అలాగే కాపు మహిళలు, రైతులపై నమోదు చేసిన అక్రమ ఎస్సీ, ఎస్టీ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు.