కృష్ణా జిల్లా: జనసేన ఎంపీ బాలశౌరి వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బందరు పోర్టుకు తానే అనుమతులు తెచ్చానని చెప్పుకుంటున్న బాలశౌరి ముందుగా తన పార్టీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. “జనసేన కార్యకర్తలకు ఇంటి ప్లాన్‌లు ఇప్పించలేని వారు బందరు పోర్టుకు అనుమతులు తెచ్చానని చెప్పుకోవడం హాస్యాస్పదం” అని పేర్నినాని విమర్శించారు. పార్టీ జెండా మోసి మోసి బందరు జనసేన కార్యకర్తల భుజాలు నొప్పులతో కాయలు కాశాయని అన్నారు. జనసేన ఇంచార్జ్ ఉన్నప్పటికీ మంత్రి కొల్లు రవీంద్ర ఒక కార్యకర్త ఇంటిని కూల్చాలని ఆదేశించారని ఆరోపించారు. “ముందు మీ కార్యకర్తల ఇళ్లకు ప్లాన్‌లు ఇప్పించండి. ఆ తర్వాతే పోర్టులు, మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చానని చెప్పుకోండి” అని ఆయన సూచించారు. “సమాచార శాఖ మంత్రి పార్థసారథి ఒక అద్దె మైకు లాంటివారు. ఆయన చెప్పే మాటలకు విలువ లేదు” అని పేర్ని నాని విమర్శించారు. ప్రభుత్వంలోని ఇతర మంత్రులు భూముల విషయంలో వేర్వేరు అంకెలు చెబుతున్నారని, దీనివల్ల ప్రజల్లో అయోమయం పెరుగుతోందని అన్నారు. “మూడు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 16 వేల స్కూల్స్ అభివృద్ధి, అన్ని వర్గాలకు విద్య, రైతులకు భరోసా, ప్రజల ఆరోగ్య పరిరక్షణ..ఇవి విజన్‌గా కనిపించవా?” అని ప్రశ్నించారు. “కంపెనీల కోసం కొండలను తీసుకోవడం మా విజన్ కాదు” అని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా పేర్నినాని సెటైర్లు వేశారు. “డీలిమిటేషన్ విషయంలో అన్ని పార్టీలకు లేఖలు రాయడం కన్నా తన ప్రభావాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోలేరా?” అని ప్రశ్నించారు. “రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆపించినట్లే డీలిమిటేషన్‌ను కూడా ఆపించవచ్చు కదా” అని అన్నారు. “చంద్రబాబును ఒక గదిలోకి పిలిచి డీలిమిటేషన్ ఓటు వేయొద్దని చెప్పగలిగితే సమస్యే ఉండదు” అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.