విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డితో కలిసి మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ప్రజాసేవలో కొనసాగారని మాజీ మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. వైయస్ జగన్ నాయకత్వంలో దేవినేని అవినాష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఘనంగా నివాళులర్పించారు. ఎగ్జిక్యూటివ్ క్లబ్ సమీపంలోని నెహ్రూ విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి పేర్నినాని, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మీతో పాటు వైయస్ఆర్‌సీపీ శ్రేణులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ దేవినేని నెహ్రూ ప్రజానాయకుడిగా నిలిచారని అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన నెహ్రూ పేదల పక్షాన నిలబడి వారికి అండగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. విజయవాడ నగర అభివృద్ధిలో ఆయన చెరగని ముద్ర వేశారని, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక పేజీని సృష్టించుకున్నారని పేర్కొన్నారు. అలాగే నెహ్రూ రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ, వైయస్ రాజశేఖరరెడ్డి గారితో కలిసి ప్రజాసేవలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని అన్నారు. ఇక నేటి తరంలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్న దేవినేని అవినాష్, వైయస్ జగన్ నాయకత్వంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని పేర్ని నాని చెప్పారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల్లో విశ్వాసం పొందారని, తనకంటూ స్థానం ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ ఎన్టీ రామారావు పిలుపుతోనే దేవినేని నెహ్రూ రాజకీయాల్లోకి వచ్చారని గుర్తుచేశారు. క్లిష్ట సమయంలో కూడా ఎన్టీఆర్ వెన్నంటే నిలిచిన నెహ్రూ, తరువాత వైయస్ఆర్‌తో కలిసి ప్రజాసేవలో కొనసాగారని తెలిపారు. తండ్రి అడుగుజాడల్లోనే అవినాష్ నడుస్తున్నారని అన్నారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు “నేనున్నాను” అని అండగా నిలిచిన మహానేత నెహ్రూ అని అన్నారు. ఆయనకు తగ్గ తనయుడిగా అవినాష్ ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతున్నానని తెలిపారు. వైయస్ఆర్‌సీపీ నాయకత్వం తనకు అండగా నిలుస్తోందని, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని అన్నారు. గత ఐదేళ్లలో నెహ్రూ అనుచరులకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించారని, తనకు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేయడం తమ లక్ష్యమని అవినాష్ స్పష్టం చేశారు.