అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు 

గుంటూరు:  గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తాజాగా మరో అక్రమ కేసు నమోదు అయ్యింది. ఆయన ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారన్నది ఈసారి పోలీసుల వాదన. తన నివాసంపై దాడి చేసి విధ్వంసం చేసిన టీడీపీ గూండాలను అరెస్ట్‌ చేయాలని.. కస్టడీలో తనను హింసించిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట ఆయన ఈ నెల 18న దీక్ష చేశారు. అయితే.. ఆయన అనుమతి తీసుకోలేదని.. పైగా ఆ దీక్ష వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని పేర్కొంటూ నగరంపాలెం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామంపై వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. 

నేను చేస్తుంది ధ‌ర్మ‌పోరాటం: అంబ‌టి రాంబాబు

‘‘నా ఇంటిపై దాడి చేసి నన్నే 18 రోజులు రాజమండ్రి జైలు పెట్టారు. అరెస్టు చేశాక పోలీస్ స్టేషన్‌లో(నల్లపాడు) నన్ను హింసించాలని ప్రయత్నించారు.  మరి దాడి చేసినవాళ్లను 18 నిమిషాలైనా జైల్లో పెట్టారా?. పోలీసుల సమక్షంలోనే నా ఇంటిపై దాడి జరిగింది.  గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారు.   చంద్రబాబు, లోకేష్‌, పెమ్మసాని ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టలేరు. టీడీపీ నేతల బెదిరింపులకు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు భయపడరు. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి చట్టబద్దంగా తేలుస్తా. దాడిపై న్యాయ పోరాటం... ప్రజా పోరాటం చేస్తా. నేను చేస్తుంది ధర్మపోరాటం. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Back to Top