పిన్నెల్లి సోదరులు  ఆద‌ర్శం

వైయ‌స్ఆర్‌సీపీ  విద్యార్థి విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి 

తిరుపతి:  తప్పుడు కేసులతో జైలుకు పంపించిన పరిస్థితుల్లో కూడా పోరాట పటిమను చూపిన మాచ‌ర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి సోదరులు తమకు ఆదర్శమని వైయ‌స్ఆర్‌సీపీ  విద్యార్థి విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుప‌తి రూరల్ మండలం తుమ్మలగుంటలోని శ్రీ క‌ళ్యాణ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యాన్ని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారిని చెవిరెడ్డి కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతించారు. చెవిరెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ, కుమారుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, ఆలయ ఈవో సుబ్బిరామిరెడ్డి సమక్షంలో పిన్నెల్లి సోదరులకు ప్రత్యేకంగా స్వామి దర్శనం ఏర్పాటు చేశారు. వేదపండితుల ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆలయ సంప్రదాయాల ప్రకారం ఘనంగా సత్కరించారు.

పిన్నెల్లి సోదరులతో పాటు వచ్చిన అనుచరులందరికీ కూడా దర్శనం కల్పించడంలో చెవిరెడ్డి కుటుంబ సభ్యులు దగ్గరుండి సహకరించారు. అనంతరం, రాష్ట్ర వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి నివాసానికి పిన్నెల్లి సోదరులు చేరుకున్నారు. చెవిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను పిన్నెల్లి సోదరులకు పరిచయం చేశారు. ఆలయం, వేద పాఠశాల నిర్వహణను కళ్లారా చూసి పిన్నెల్లి సోదరులు ఆనందం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక సేవలతో పది మందికి ఆదర్శంగా నిలుస్తున్న చెవిరెడ్డి కుటుంబంపై కూడా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని వారు వ్యాఖ్యానించారు.  పోరాటంతో పుట్టిన వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు కూటమి పార్టీలపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. అనంతరం చెవిరెడ్డి కుటుంబీకులు ఏర్పాటు చేసిన తేనీటి విందులో పిన్నెల్లి సోదరులు, వారి అనుచరులు పాల్గొన్నారు.
 

Back to Top