పదవి ఉన్నా… లేకున్నా ప్రజలతోనే ఉండాలి

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపు

శ్రీకాకుళంలో సర్పంచులకు ఆత్మీయ సన్మానం 

శ్రీకాకుళం: ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, పదవి లేకున్నా ప్రజలతో మమేకమై సేవ చేయడం ప్రతి నాయకుడి బాధ్యత అని మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఇటీవల పదవీకాలం ముగిసిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం రూరల్, గార మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులను సత్కరించిన ధర్మాన ప్రసాదరావు, గ్రామాభివృద్ధికి వారు చేసిన సేవలను కొనియాడారు. గ్రామ స్థాయి పాలనలో సర్పంచులు, వార్డు సభ్యులు కీలక పాత్ర పోషిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చూపిన కృషి అభినందనీయం అని అన్నారు.

“పదవి అనేది తాత్కాలికం… కానీ ప్రజలతో అనుబంధం శాశ్వతం. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి” అని ఆయన సూచించారు. భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యలపై స్పందిస్తూ సేవాభావంతో ముందుకు సాగాలని కోరారు. కార్య‌క్ర‌మంలో మాజీ డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top