తాడేపల్లి: ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ, ప్రభుత్వం తీరును ఎండగట్టారు. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ ఎక్స్ వేదికగా.. “నిజానికి MGNREGA గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుంది. పల్లె ప్రజలకు ఆదాయం సమకూరుతుంది. అలాంటి చారిత్రాత్మక పథకాన్ని అమలు చేయడంలో ఏపీ ఒకప్పుడు ముందంజలో ఉండేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో పూర్తిగా వెనుకబడి పోయింది” అని వైయస్ జగన్ పేర్కొన్నారు. ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య, ఖర్చులు, మొత్తం వ్యయం వంటి గణాంకాలు పరిశీలిస్తే ఈ పరిస్థితి స్పష్టంగా తెలుస్తోందని ఆయన అన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో జీఎస్టీ, అమ్మకపు పన్ను వృద్ధి తగ్గడానికి కూడా ఇదొక ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోయిందని, దీనికి ప్రభుత్వ అవినీతి, ధనదాహమే కారణమని జగన్ పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని తీవ్రంగా విమర్శించారు.