తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పాలనను గాలికొదిలేసి, కేవలం ప్రతిపక్షంపై బురదజల్లడమే లక్ష్యంగా 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తోందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కడపలో వ్యక్తిగత కారణాలతో జరిగిన దస్తగిరి హత్యను వైయస్. జగన్ కి ఆపాదించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అమరావతిలో జరుగుతున్న వేల కోట్ల దోపిడీని మరియు గత 21 నెలల్లో జరిగిన 30కి పైగా రాజకీయ హత్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే మంత్రులు రాజీలేని అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నేరచరిత్రను వంగవీటి నరేంద్ర ఎండగట్టారు. గాంధేయవాదంతో దీక్ష చేస్తున్న వంగవీటి మోహన రంగాను నడిరోడ్డుపై చంపించింది మొదలు, వైయస్ రాజారెడ్డి హత్య నిందితులకు ఆశ్రయం కల్పించడం వరకు బాబు హయాంలో జరిగినవన్నీ ప్రభుత్వ ప్రేరేపిత హత్యలేనని ఆరోపించారు. మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్ హత్యా ఉదంతాలను గుర్తుచేస్తూ.. హత్యలు చేయించి ఇతరులపై నిందలు వేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. మంత్రులు తమ శాఖలపై దృష్టి పెట్టకుండా కేవలం భజన బృందాల్లా మారి వైయస్. జగన్ పై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. డైవర్షన్ పాలిటిక్స్‌లో కూటమి ప్రభుత్వం.. ఆంధ్రరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధిని విస్మరించి, కేవలం 'డైవర్షన్ పాలిటిక్స్' తో కాలక్షేపం చేస్తోంది. కడపలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దస్తగిరి హత్య వ్యక్తిగత కారణాలతో జరిగితే, దాన్ని వైయస్. జగన్ కి ఆపాదించడం అత్యంత హేయం. రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న వేల కోట్ల అక్రమాలను, గత 21 నెలల్లో జరిగిన 30కి పైగా రాజకీయ హత్యలను ప్రజలు గమనించకూడదనే ఉద్దేశంతోనే మంత్రులు రామానాయుడు, పార్థసారథిలు జగన్ గారిపై బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుది నెత్తుటి చరిత్ర.. హత్యారాజకీయాల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. ఎన్టీఆర్ పై హత్యాయత్నం చేసిన మల్లెల బాబ్జీ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆయన వద్ద దొరికిన లేఖ ద్వారా బాబు కుట్రలు అప్పట్లోనే బయటపడ్డాయి. చంద్ర బాబు అక్రమాలను ఎండగట్టిన జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ ని విజయవాడ నడిరోడ్డుపై అతి దారుణంగా చంపించారు. గాంధేయవాదంతో దీక్ష చేస్తున్న వంగవీటి మోహన రంగాను ప్రభుత్వం అండతోనే హతమార్చారని, ఆ హత్య వెనుక టీడీపీ ఉందన్నది చిన్న పిల్లోడిని అడిగినా చెబుతారు. రంగా హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణకు విశాఖ తూర్పు నియోజకవర్గం సీటు ఇచ్చి బాబు తన పాత బంధాన్ని నిరూపించుకున్నారు. వైయస్ రాజారెడ్డి హత్యలో బాబు పాత్ర.. 1998లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి రాజారెడ్డిని బాబు హయాంలోనే పాశవికంగా చంపితే..ఆ హంతక మూకలకు హైదరాబాద్‌లో 30 రోజుల పాటు చంద్రబాబే ఆశ్రయం ఇచ్చారు. చంద్రబాబు పాలనలోనే పత్తికొండలో నారాయణరెడ్డి, వినుకొండలో రషీద్ లను నడిరోడ్డుపై చంపిస్తున్న నేరచరిత్ర చంద్రబాబుది. సొంత కుటుంబ సభ్యుల విమర్శలే సాక్ష్యం.. చంద్రబాబు నేరచరిత్రపై ఆయన మామ ఎన్టీఆర్, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి గతంలో చేసిన విమర్శలను మంత్రులు గుర్తుచేసుకోవాలి. "మీ వైపు ఒక వేలు చూపిస్తే.. మూడు వేళ్లు మీ వైపు ఉంటాయని మర్చిపోవద్దు". అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఎక్కడున్నారో తెలియని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా టీడీపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు నేరచరిత్రను కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాస్తవాలు ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు. వంగవీటి రంగా నుండి నేటి వరకు జరిగిన ప్రతి రాజకీయ హత్య వెనుక టీడీపీ హస్తం ఉందన్నది జగమెరిగిన సత్యమని మండిపడ్డారు. మంత్రులు రామానాయుడు, పార్థసారథిలు తమ శాఖలను గాలికొదిలేసి వైయస్. జగన్ పై విషప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్‌కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడదని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, దోపిడీని ప్రజల ముందు ఎండగడుతూనే ఉంటామని ఆయన హెచ్చరించారు. అబద్ధపు నిందలతో ప్రజలను మోసం చేయలేరని, బాబు నేరచరిత్రపై న్యాయపోరాటం కొనసాగిస్తామని నరేంద్ర స్పష్టం చేశారు.