వైయస్ఆర్ జిల్లా: మహిళా సాధికారత దిశగా ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణలోకి తీసుకువచ్చిన ప్రభుత్వం వైయస్ఆర్‌సీపీ అని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం నాయకురాళ్లు స్పష్టం చేశారు. వైయస్ జగన్ నాయకత్వంలో మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించే దిశగా పలు కీలక నిర్ణయాలు అమలు చేసినట్టు చెబుతున్నారు. రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే సామాజిక సాధికారతకు శ్రీకారం చుట్టిన జగన్, మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచేందుకు ముందడుగు వేశారు. స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా మహిళలకు గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు నాయకత్వ అవకాశాలు కల్పించారు. దేశవ్యాప్తంగా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లుకు కూడా వైయస్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నిర్ణయంతో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర కేబినెట్‌లో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఒక ఉప ముఖ్యమంత్రి పదవి సహా నలుగురు మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం ద్వారా పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. మేకతోటి సుచరిత, తానేటి వనిత హోం మంత్రులుగా పనిచేయగా, పాముల పుష్పశ్రీవాణి ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. అదేవిధంగా విడదల రజని, ఆర్కే రోజా తదితరులకు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. శాసనమండలి ఉపాధ్యక్షురాలిగా ముస్లిం మహిళకు అవకాశం కల్పించడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. అలాగే రాష్ట్ర తొలి మహిళ ప్రధాన కార్యదర్శిగా, తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకం మహిళల ప్రాధాన్యాన్ని చాటింది. స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది. జడ్పీ చైర్పర్సన్‌లలో యాభై నాలుగు శాతం, ఉప చైర్మన్‌లలో యాభై ఎనిమిది శాతం, మున్సిపల్ కార్పొరేషన్లలో యాభై శాతం కంటే ఎక్కువగా మహిళలకు పదవులు లభించాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల అధ్యక్ష పదవుల్లో కూడా యాభై శాతం కంటే ఎక్కువ మహిళలకు అవకాశం కల్పించడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థలో యాభై మూడు శాతం మహిళలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో యాభై ఒక శాతం మహిళలు ఉండడం మహిళా సాధికారతకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ పనుల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రత్యేక చట్టం చేయడం దేశ చరిత్రలో అరుదైన నిర్ణయంగా నిలిచింది. మార్కెట్ యార్డు చైర్మన్ పదవుల్లో కూడా మహిళలకు అధిక ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. మహిళలను రాజకీయంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లే దిశగా జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మహిళా సాధికారతకు బలమైన పునాది వేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.