ఢిల్లీ: లోక్‌సభలో నియోజకవర్గాల పెంపు (డీలిమిటేషన్) , మహిళా రిజర్వేషన్ బిల్లుపై వైయస్ఆర్‌సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్‌పై ప్రభుత్వం చెబుతున్న అంశాలను లిఖితపూర్వకంగా బిల్లులో పొందుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాంతీయ అసమానతలు లేకుండా సమతుల్యంగా నియోజకవర్గాల పెంపు జరగాలని, అన్ని రాజకీయ పార్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా ప్రక్రియ ఉండాలని సూచించారు. విపక్షాలను అణచివేసే విధంగా డీలిమిటేషన్ ఉండకూడదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళలకు సంక్షేమ పథకాల అమలులో ప్రాధాన్యం కల్పిస్తూ, ఇళ్ల పట్టాలు మహిళల పేర్లతోనే అందించిన ఘనత కూడా జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మహిళలను వేధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. అసభ్యకర వీడియోలు బయటపడినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన మహిళలపైనే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నప్పటికీ, తాము లేవనెత్తిన అన్ని అంశాలను పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.