శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్మించింది కాలనీలు కాదని, ఊళ్లే నిర్మించారని నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం పంచాయతీ పరిధిలో నిర్మించిన జగనన్న కాలనీని వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్‌రెడ్డి “జగనన్న కాలనీ – చంద్రబాబు కహానీ” పేరుతో ఇంటింటికి తిరిగి జగనన్న హయాంలో నిర్మించిన ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళలు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాకాణి మాట్లాడుతూ, చెన్నై జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న అత్యంత విలువైన 14 ఎకరాల భూమిని పేదలకు అందించడం జగనన్న ప్రభుత్వ ఘనత అని పేర్కొన్నారు. దాదాపు రూ.70 కోట్ల విలువైన భూమిని నిరుపేదలకు ఉచితంగా కేటాయించడం ద్వారా పేదల సొంతింటి కలను నిజం చేశారని అన్నారు. పేదల ఇళ్లపై జగన్ ప్రభుత్వం దృష్టి: పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పనిచేశారని, ఆయన హయాంలో ఇళ్ల నిర్మాణం ఒక యజ్ఞంలా సాగిందని కాకాణి వివరించారు. “ఇళ్లు కాదు… ఊళ్లే నిర్మించాం” అని పేర్కొంటూ, క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. 2014–2019 మధ్య చంద్రబాబు పాలనలో పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో నిర్లక్ష్యం చూపారని విమర్శించారు. గిరిజనులు, పేదలు అనేక ఇబ్బందులు పడుతూ జీవించాల్సి వచ్చిందని తెలిపారు. 2019లో వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే అక్రమ ఆక్రమణల్లో ఉన్న భూములను విడిపించి, దశలవారీగా 14 ఎకరాల్లో 520 ప్లాట్లను పేదలకు పంపిణీ చేసినట్లు వివరించారు. మొదటి విడతలో 7 ఎకరాల్లో 260 ప్లాట్లు, రెండో విడతలో మరో 7 ఎకరాల్లో 260 ప్లాట్లు కేటాయించినట్లు చెప్పారు. ఆర్థిక సాయం – మౌలిక సదుపాయాలు జగనన్న ప్రభుత్వం ప్రతి ఇంటికి రూ.1.80 లక్షల నగదు సాయం, రూ.35,000 వడ్డీ లేని రుణం, ఉచిత ఇసుక వంటి సదుపాయాలు కల్పించిందని చెప్పారు. అలాగే విద్యుత్ మీటర్లు, వైరింగ్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం జగనన్న కాలనీలను నిర్లక్ష్యం చేస్తోందని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పూర్తయిన ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ పనులు నిలిచిపోయాయని అన్నారు. పేదలకు రావాల్సిన రూ.60–70 వేల బకాయిలను విడుదల చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. `జగనన్న గృహం – చంద్రబాబు ద్రోహం` “జగనన్న గృహం – చంద్రబాబు ద్రోహం” పేరుతో ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని, చంద్రబాబు చెప్పే ఇళ్ల నిర్మాణ గణాంకాలు వాస్తవానికి విరుద్ధమని అన్నారు. గతంలో టిడ్కో ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో కేవలం ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇళ్లను అందించామని, డిపాజిట్ భారాన్ని భారీగా తగ్గించి పేదలకు అండగా నిలిచామని తెలిపారు. నాడు భారీ స్థాయిలో గృహ నిర్మాణం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 వేల లేఅవుట్లలో 22 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పటికే 9 లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. పేదల ఇళ్ల కోసం దాదాపు ఒక లక్ష ఎకరాల భూమిని కేటాయించి, మొత్తం రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నిర్మించిన ఇళ్లను మీడియా సమక్షంలో చూపించడానికి సిద్ధమని, కూటమి నాయకులు చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. పేదల సంక్షేమం కోసం వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోరాడుతామని కాకాణి స్పష్టం చేశారు. 2029లో మళ్లీ వైయస్ జగన్ నాయకత్వం కోరుకుంటున్నారని ప్రజల్లో భావన ఉందని తెలిపారు.