పులివెందుల:రాష్ట్రంలో ఏం జరిగినా వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, వైయస్ఆర్‌సీపీ నేతలకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, పులివెందులలో పెద్ద దస్తగిరి హత్య విచారణ సాగుతున్న తీరే ఇందుకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆక్షేపించారు. పెద్ద దస్తగిరి హత్యకూ, వైయస్ఆర్‌సీపీపీకి ఎలాంటి సంబంధం లేదని, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించలేదని గుర్తుచేశారు. కాబట్టి చంద్రబాబు గోబెల్స్ ప్రచారాలు మానుకుని, దస్తగిరి హత్యపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేయించి బాధ్యుల్ని శిక్షించాలని రవీంద్ర నాథ్ రెడ్డి కోరారు. ప్రెస్ మీట్ లో రవీంద్ర నాథ్ రెడ్డి ఇంకేమన్నారంటే... చంద్రబాబు హత్యా రాజకీయాలు అందరికీ తెలుసు మల్లెల బాబ్జీ ఆత్మహత్య, రిటైర్డ్ అధికారి రాఘవేంద్రరావు హత్య, వంగవీటి మోహనరంగా హత్య, పింగళి దశరథరామ్ హత్యలు ఎవరు చేశారనేది జగమెరిగిన సత్యం. వీటి వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేయడంలో సిద్దహస్తుడు. ఏపీలో ఏ సంఘటన జరిగినా దాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి మీద రుద్దడం, పార్టీ నేతల్ని బదనాం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ ఘటన జరిగినా తన సొంత మీడియాను వాడుకుని డిబేట్లు పెడతారు, దాని మీద తమ పార్టీ నేతలతో పదే పదే మాట్లాడిస్తారు. ఒకే విషయం పదే పదే చెప్తే ప్రజలు దాన్ని నమ్మేస్తారని చంద్రబాబు అనుకుంటాడు. తన మీడియా చెప్తే ఏదైనా ప్రజలు నమ్మేస్తారని ఆయన అనుకుంటాడు. పెద్ద దస్తగిరి హత్యకూ, మాకూ సంబంధం లేదు పులివెందులలో 15 రోజుల క్రితం జరిగిన పెద్ద దస్తగిరి ఘటనలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని, పోలీసులే దాన్ని చూసుకుంటారని మేం అనుకున్నాం. కానీ రెండు రోజులుగా వైయస్ఆర్‌సీపీకి దీన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దస్తగిరి వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరుడు, మృదుస్వభావి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేసేవాడు. కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికీ, పెద్ద దస్తగిరికీ పెద్దగా వైషమ్యాలు కూడా లేవు. కానీ నిత్యానందరెడ్డి పేరు ఎందుకు లాగారో తెలియడం లేదు. మా వాళ్లకు ఈ హత్యను అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ ఘటనలో దొరికిన గ్యాంగ్ నిత్యానందరెడ్డికి దగ్గరి వాళ్లని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మా వేళ్లతో కళ్లు పొడ్చుకునే పనులు మేం చేయం. వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో బీసీకి రిజర్వ్ అయితే దస్తగిరే అభ్యర్ధిగా ఉండేవాడు. ఆయన మా నాయకులే కాదు ఊళ్లో అందరితోనూ వ్యాపారం చేస్తాడు. కానీ దీన్ని మా నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డికీ, మా నాయకులకూ అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దస్తగిరిని హత్య చేసిన వారిని శిక్షించాలనే మేం కోరుతున్నాం. ఫ్యాక్షన్ రాజకీయాల్ని వైయస్ఆర్ , జగన్ ఎప్పుడూ ప్రోత్సహించలేదు ఫ్యాక్షన్ రాజకీయాల్ని వైయస్ఆర్ కానీ, జగన్ గారు కానీ ఎప్పుడూ ప్రోత్సహించలేదు. ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలు నాశనం అవుతాయని వైఎస్సార్ ఎంతో మందిని రాజీ చేయించారు. రాజారెడ్డి గారి హత్య ఎవరు చేశారో కూడా తెలిసినా మేం వాళ్ల జోలికి పోలేదు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన రెడ్డి హత్యా రాజకీయాల్ని ఎప్పుడూ ప్రోత్సహించరు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ ఎలా అయ్యారో ఆయనే స్వయంగా చెప్పారు. బీటెక్ రవి ఓ ఇంటర్వ్యూలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అనుకుంటే నేను బతికి ఉండేవాడిని కాదని గతంలో చెప్పారు. అధికారులు కూడా వాస్తవాల ఆధారంగా పనిచేయండి, ఈ మూడేళ్ల తర్వాత ప్రభుత్వం మారుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలని అధికారులకు రవీంద్ర నాథ్ రెడ్డి హితవు పలికారు.