పెద్ద దస్తగిరి హత్యను రాజకీయం చేయ‌వ‌ద్దు

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా 

వైయ‌స్ఆర్ జిల్లా : పెద్ద దస్తగిరి హత్యను రాజకీయం చేయ‌వ‌ద్దని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హిత‌వు ప‌లికారు. క‌డ‌ప న‌గ‌రంలోని త‌న క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్ద దస్తగిరి హత్య ఘటనపై ఆయ‌న స్పందించారు. ఈ హత్యను రాజకీయ రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది చాలా బాధాకరమని అన్నారు. పెద్ద దస్తగిరిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఆయన, ఈ కేసులో మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద‌రెడ్డిని నిందితుడిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అయితే ఈ ఘటన వ్యక్తిగత సమస్య మాత్రమేనని, దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

మరణించిన దస్తగిరి వైయ‌స్ఆర్‌సీపీ అభిమాని, మంచివాడని పేర్కొంటూ, బండి నిత్యానంద రెడ్డి , దస్తగిరి మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీసీకి రిజర్వేషన్ వస్తే దస్తగిరినే అభ్యర్థిగా నిలబెట్టే పరిస్థితి ఉందని చెప్పారు. ఇటీవలి రెండు రోజులుగా ఈ ఘటనను రాజకీయంగా మలచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం , మంత్రులు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై నిందలు మోపడం హాస్యాస్పదమని విమర్శించారు. సొంత పత్రికల్లో కూడా దీనిపై అనుకూలంగా వార్తలు, చర్చలు నిర్వహిస్తున్నారని అన్నారు.  రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై మోపే ధోరణి పెరిగిందని, ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చంద్ర‌బాబు  కుట్ర రాజకీయాలకు ప్రతీకగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

వైయ‌స్ జ‌గ‌న్‌, వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని, పులివెందులలో వర్గాల మధ్య రాజీ చేసి అభివృద్ధి దిశగా నడిపించారని గుర్తుచేశారు. ఈ కేసులో అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాలు వెలికితీయాలని కోరారు. పాత విషయాలను దృష్టిలో పెట్టుకుని కేసుల్లో ఇరికించడం సరికాదని సూచించారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను మంత్రులు చదువుతున్నట్టుగా ఆరోపిస్తూ, భవిష్యత్తులో దీనికి పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. స‌మావేశంలో ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి, సీఈసీ సభ్యులు సురేష్ బాబు, మాజీ మేయర్ పాకా సురేష్ తదితరులు పాల్గొని, రాష్ట్రంలో జరిగే హత్యలను రాజకీయాలకు వాడుకోవడాన్ని ఖండించారు. 

Back to Top