నరసరావుపేట: వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని వైయస్ఆర్‌సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. నరసరావుపేట పట్టణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు షేక్ నాగూర్ బాబు అలియాస్ హన్నుపై జరిగిన దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, ప్రస్తుతం నమోదైన సెక్షన్ 324 కేసును 307గా మార్చాలని వైయస్ఆర్‌కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నిన్న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో లింగంగుంట్ల రాజుపాలెం వైయస్ఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు హన్నుపై రాడ్లు, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. హన్ను తలకు ఏడు కుట్లు పడగా, ప్రస్తుతం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. ఇంత తీవ్రమైన దాడి జరిగినప్పటికీ పోలీసులు కేవలం సెక్షన్ 324 కింద కేసు నమోదు చేయడం సరికాదని, మారణాయుధాలతో దాడి జరిగినందున దాన్ని 307గా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తులు స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు పుట్టినరోజు ర్యాలీలో పాల్గొన్నారని, దీనిని బట్టి ఈ దాడి వెనుక ప్రణాళిక ఉందని ఆరోపించారు. దాడికి సంబంధించి వాహనం, ఫోటోలు కూడా మీడియాకు చూపించినట్లు తెలిపారు. ఇక ఈ ఘటనలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి స్థానిక టీ స్టాల్ నిర్వాహకుడు అని ఆరోపిస్తూ, గతంలో కూడా పలు ఘటనల్లో అతని పాత్ర ఉందని పేర్కొన్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు స్థానం లేదని, ఏవైనా సమస్యలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, దాడులతో తమను భయపెట్టలేరని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ వెంటనే జోక్యం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ల మాధవి మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.