రాష్ట్రంలో పరిశ్రమల‌కు కూటమి ప్రభుత్వమే శాపం

పారిశ్రామిక‌వేత్త‌ల‌ను బెదిరించ‌డంతో పరిశ్రమలు తరలిపోతున్నాయి

నిసిగ్గుగా, నిర్లజ్జగా ఆ నిందను గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై వేస్తున్నారు 

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు మండిపాటు

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు

రాష్ట్రంలో పరిశ్రమలపై కూటమి ఎమ్మెల్యేల బెదిరింపులు అధిక‌మ‌య్యాయి

ఆర్గనైజ్డ్‌గా అవినీతి చేయడమే అధికార పార్టీ నేత‌ల లక్ష్యం 

అల్ట్రాటెక్ ఫ్యాక్టరీపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దౌర్జన్యం 

కార్మికులు, వాహనాలను అడ్డుకొని ఫ్యాక్ట‌రీ నిర్వాహ‌ణ‌కు అంత‌రాయం

అల్ట్రాటెక్ ఫ్యాక్ట‌రీలో 89 శాతం స్థానికులు ఉన్న‌ట్లు నిర్ధార‌ణ‌

అయినా ఆ ఫ్యాక్ట‌రీపై ఆదినారాయ‌ణ‌రెడ్డి వేధింపులు ఆగడం లేదు

చంద్ర‌బాబు ఆశీస్సుల‌తోనే వాటా కోసం ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి బెదిరింపులు 

ప్ర‌తీ ప‌రిశ్ర‌మ వ‌ద్ద కూట‌మి ఎమ్మెల్యేలు క‌ప్పం వ‌సూళ్లు 

పారిశ్రామికవేత్తలను వేధిస్తే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయి? 

కూట‌మి ప్ర‌భుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించిన టీజేఆర్ సుధాక‌ర్‌బాబు 

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, కూటమి ప్రభుత్వ విధానాల వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఆక్షేపించారు. పారిశ్రామికవేత్తలను బెదిరించడం, కప్పం క‌ట్టాలంటూ హుకుం జారీ చేయ‌డం, అనవసర అడ్డంకులు సృష్టించడం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు భద్రత లేకుండా పోయిందని, ఈ పరిస్థితుల్లో కొత్త పరిశ్రమలు రాష్ట్రంలోకి రావడం అసాధ్యమని తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుధాక‌ర్‌బాబు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులకు పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసిన ఆయన, నిసిగ్గుగా, నిర్లజ్జగా ఆ నిందను గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై మోపడం దుర్మార్గమని మండిపడ్డారు. గతంలో పరిశ్రమలను తరిమివేశారని తప్పుడు ప్రచారం చేసినవారే ఇప్పుడు బహిరంగంగా పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారని విమర్శించారు. 

ప్రెస్‌మీట్‌లో టీజేఆర్ సుధాక‌ర్‌బాబు ఇంకా ఏమ‌న్నారంటే..
పరిశ్రమలకు త‌ప్ప‌ని బెదిరింపులు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. త‌ప్పుడు కేసులు, అక్ర‌మ అరెస్టులు, వేధింపులు, రాజకీయ కక్షసాధింపు చర్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు పరిశ్రమలపై కూడా బెదిరింపులు మొదలయ్యాయి. ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్న పరిశ్రమలు సక్రమంగా నడవాలన్నా… కొత్తగా పరిశ్రమలు పెట్టాలన్నా కూటమి నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. అందరూ కలిసి ఆర్గనైజ్డ్‌గా అవినీతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 

దోపిడీలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పోటీ 
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన ఎమ్మెల్యేలు దోపిడీలో పోటీప‌డుతున్నారు. అలాంటి వారిని మంద‌లించాల్సిన ముఖ్య‌మంత్రి.. వారిని కూర్చోబెట్టి సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. తాజాగా వైయస్‌ఆర్‌ జిల్లా చిల్లంకూరులోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రెచ్చిపోయారు. ముఖ్యమంత్రిని కలిసిన తరువాత తన అనుచరులను పంపించి కార్మికులను అడ్డుకోవడం, ముడి సరుకులు తీసుకెళ్లే వాహనాలను నిలిపివేయడం, ఆర్టీవో అధికారులను ఉపయోగించి వాహ‌నాలను అడ్డుకోవ‌డం వంటి చర్యలకు దిగారు. ఆల్ట్రాటెక్ ఫ్యాక్టరీలో 89 శాతం స్థానికులే పనిచేస్తున్నారని అధికారులే నివేదిక ఇచ్చారు. కాలుష్య నియంత్రణ కూడా సక్రమంగా ఉందని తేలింది. అయినా కూడా వాటా కోసం బెదిరింపులు కొనసాగిస్తున్నారు.  చంద్ర‌బాబు ఆశీస్సుల‌తోనే వాటా కోసం ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి బెదిరింపుల‌కు పాల్ప‌డుతూ పారిశ్రామిక‌వేత్త‌ల‌ను రాష్ట్రం నుంచి తరిమివేసేందుకు యముడిలా వెంట‌ప‌డుతున్నాడు.

పారిశ్రామిక‌వేత్త‌ల‌పై అక్ర‌మ కేసులు, బెదిరింపులు
 గతంలో వికాట్ పరిశ్రమ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అక్రమ కేసులో ఇరికించడానికి ప్రయత్నించారు. ఒక సినీ న‌టిని అడ్డం పెట్టుకుని సజ్జన్ జిందాల్‌ను బెదిరించడంతో ఆ పరిశ్రమ మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఇది రాష్ట్రానికి నష్టం కాదా? . తాడిపత్రిలో ఎల్ అండ్ టీ సిమెంట్ ఫ్యాక్టరీ, గండికోట వద్ద ఆదానీ హైడ్రోపవర్ ప్రాజెక్ట్, కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, పల్నాడు భవ్య సిమెంట్స్, శ్రీకాకుళం ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా కూటమి ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని కప్పాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ లారీకి డబ్బులు ఇవ్వాలని, కాంట్రాక్టులు తమవారికే ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్ర‌తి సిమెంట్ బ్యాగుకు కప్పం కట్టాలనే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ విధంగా పారిశ్రామికవేత్తలను వేధిస్తే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయి?.

గ‌త ప్ర‌భుత్వంపై నిర్ల‌జ్జ‌గా నింద‌లు
గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం పరిశ్రమలను తరిమివేస్తుందని తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు బహిరంగంగానే దోపిడీ చేస్తూ పట్టుబడుతున్నారు. అయినా నిర్లజ్జగా నిందను మాపై వేస్తున్నారు. 2014-2019 మ‌ధ్య , ఈ రెండేళ్ల‌లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రాష్ట్రానికి తెచ్చిన ప‌రిశ్ర‌మ‌ల లెక్క ఎంతో చెప్పే ద‌మ్ముందా? . వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పరిశ్రమలను బెదిరిస్తూ కప్పాలు వసూలు చేయడం దుర్మార్గం.

ఇలాంటి పన్నాగాలు పన్నుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారు అని టీజేఆర్‌ సుధాకర్‌బాబు హెచ్చరించారు.

Back to Top