కర్నూలు జిల్లా: మహిళ సాధికారతకు వైయస్ఆర్‌సీపీ ఎప్పటి నుంచో కట్టుబడి ఉందని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ కేడీసీ చైర్మన్ ఎస్.వి. విజయ మనోహరి తెలిపారు. మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించే దిశగా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నదని పేర్కొన్నారు. ఆనాడు అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేసి మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచిన ఘనత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మహిళలకు నాయకత్వ అవకాశాలు విస్తరించాయని వివరించారు. అదేవిధంగా రాష్ట్ర కేబినెట్‌లో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ డిప్యూటీ సీఎం పదవి సహా నలుగురు మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం ద్వారా మహిళల పాత్రను మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ నాయకత్వంలో మహిళలకు సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేశారని కొనియాడారు. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్లుకు వైయస్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. మహిళల అభివృద్ధి, సాధికారత కోసం వైయస్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎస్.వి. విజయ మనోహరి తెలిపారు.