కర్నూలు: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన కోసం ప్రతి ఒక్క రాయలసీమ బిడ్డ సిద్ధంగా ఉండాలని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. రాయలసీమ సాగునీటి సమస్యల పరిష్కారం, ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యంగా వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కర్నూలు గుత్తి రోడ్డులోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్‌లో “రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు – సమాలోచన” సమావేశం నిర్వహించారు. పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన సాకే శైలజానాథ్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన కోసం ప్రతి ఒక్క రాయలసీమ బిడ్డ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టు అమలు ద్వారా ప్రాంతంలో ఉన్న నీటి కొరత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమం, ప్రాంతీయ సమతుల్య అభివృద్ధి దృష్ట్యా ఈ ఉద్యమం అత్యవసరమని పేర్కొన్నారు. రాయలసీమ హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని, రాబోయే కార్యక్రమాల్లో భారీగా పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తూ, భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించాలని నాయకులు నిర్ణయించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. అలాగే మాజీ ఎంపీలు తలారి రంగయ్య, బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు విరూపాక్ష, బాల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, కంగాటి శ్రీదేవి, ఎర్రకోట రాజీవ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మాజీ మేయర్ బీవై రామయ్య, ఏడీసీసీ చైర్‌పర్సన్ విజయ మనోహరి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పార్లమెంట్ పరిశీలకులు జ్ఞానేశ్వర్ రెడ్డి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంజునాథ్ యాదవ్, మహిళా విభాగం నాయకురాలు శ్వేత రెడ్డి, అలాగే పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. 26 వేల మంది రైతులు త్యాగఫలమే శ్రీశైలం ప్రాజెక్టు - కర్నూలు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆపమన్నాడని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడానికి అదేమైనా చంద్రబాబు తాత ఆస్థా. ఆపేసిందే కాకుండా ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతులు లేవని చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడు. రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లందించే గొప్ప ప్రాజెక్టు కోసం చంద్రబాబు ఆ మాత్రం కృషి చేయలేరా? రాయలసీమలో పుట్టి రాయలసీమ ఓట్లతో నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు.. ఎన్టీటీ అనుమతులు తీసుకురావడం బాధ్యతగా స్వీకరించాలి. పక్కరాష్ట్రం తెలంగాణలో అనుమతులు లేకుండా కడుతున్న అక్రమ ప్రాజెక్టులపైనా చంద్రబాబు నోరు మెదపకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు. రాయలసీమకు అన్యాయం జరుగుతున్నా ఓటుకు నోటు కేసుకి భయపడి చంద్రబాబు నోరెత్తడం లేదు. వైయస్సార్సీపీ హయాంలోనే రూ. 900 కోట్లు ఖర్చు చేసి దాదాపు 90 శాతం పనులు పూర్తయినా రెండేళ్లుగా ప్రాజెక్టును పట్టించుకున్న పాపానపోలేదు. రాయలసీమ లిఫ్టు పూర్తికాకపోతే భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. అమరావతి కోసం భూములిచ్చిన రైతులదే త్యాగమైతే, శ్రీశైలం ప్రాజెక్టు కోసం 26 వేల మంది రైతులు ఇళ్లు, పొలాలు, యావదాస్తిని త్యాగం చేశారు. ఊర్లకు ఊర్లే కనుమరుగయ్యాయి. వీరిది త్యాగం కాదా? రాయలసీమ లిఫ్టుతోపాటు వేదావతి ప్రాజెక్టు పూర్తి చేసి హంద్రీనీవా కెపాసిటీ పెంచాలి. గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్డీఎస్ కుడి కాలువ పనులు పూర్తి చేయాలి. హంద్రీనీవా లైనింగ్ పనుల్లో భారీ అవినీతి - అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు వరుసగా తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హంద్రీనీవా ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది కేవలం రూ. 24కోట్లు మాత్రమే. వైయస్సార్ సీఎం 2004లో అయ్యాక 5టీఎంసీలతో తాగునీటి ప్రాజెక్టుగా ఉన్న హంద్రీనీవాను 40 టీఎంసీలకు పెంచి తాగు,సాగు నీటి ప్రాజెక్టుగా మార్చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏకంగా రూ. 5484 కోట్లు ఖర్చు చేసిన ఘనత దివంగత వైయస్సార్ కే దక్కుతుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. 2014-19 మధ్య సీఎంగా చేసిన చంద్రబాబు హంద్రీనీవాకి చేసిన ఖర్చు కేవలం రూ 300 కోట్లు మాత్రమే. 2024లో మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక రాయలసీమ ప్రాజెక్టు జీవోను రద్దు చేయడంతోపాటు హంద్రీనీవా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 6300 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కులకు తగ్గిస్తూ దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నాడు. రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నాడు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తుంటే ఓర్చుకోలేక వైయస్సార్సీపీ నాయకుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న నాయకులు బూతులతో ఎదురుదాడి చేస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టుల ఆవశ్యకతపై దుష్ప్రచారం చేస్తున్నారు. హంద్రీనీవా లైనింగ్ పనుల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారు. రాయలసీమ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు. రాయలసీమకు జరుగుతున్న ద్రోహంపై మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబుని నిలదీయాలి. రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసే వరకు వైయస్సార్సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు ద్రోహాలపై ఉద్యమించాలి - కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు దివంగత నేత వైయస్సార్ తో కలిసి రాయలసీమ ప్రాజెక్టుల కోసం పాదయాత్రలు, నిరాహార దీక్షలు చేశా. చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం రైతులను పట్టించుకున్న పాపానపోలేదు. మాటలతో మభ్యపెట్టడం తప్ప చేసిందేమీ లేదు. హంద్రీనీవాలో పారుతున్న ప్రతి నీటి బొట్టుమీదా వైయస్సార్ పేరు ఉంటుంది. వైయస్సార్ కృషితోనే రాయలసీమలో సాగునీటి రంగానికి మేలు జరిగింది. రాయలసీమకు జరిగే అన్యాయాన్ని ఊహించి వైయస్ జగన్ గారు రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ద్రోహాలపై రాయలసీమ వాసులంతా ఉద్యమించాలి. పోరాటాలకు సిద్ధం కావాలి - తలారి రంగయ్య, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త గ్రేటర్ రాయలసీమ గడ్డ మీద పుట్టిన బిడ్డల పోరాటాలకు సమయం ఆసన్నమైంది. కర్నూలు రాజధానిగా ఉండి ఉంటే ఈరోజు రాయలసీమ ప్రాంతం చెన్నై, బెంగళూరుకి దీటుగా అభివృద్ధి చెంది ఉండేది. రాయలసీమ లిఫ్టు కోసం అందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చింది. రాయలసీమ లిఫ్టును ఆపేసిన చంద్రబాబు, టీడీపీ నాయకులను నిలదీయాలి. రాయలసీమ ద్రోహి చంద్రబాబు - బూసిని విరూపాక్షి, ఆలూరు వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రాయలసీమ ప్రాంత అభివృద్ధి మీద చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు. ఆయనకి రాయలసీమ ప్రజల ఓట్లు మాత్రమే కావాలా? ఓటుకునోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు రాయలసీమ అభివృద్ధిని పణంగా పెట్టాడు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు. 2015లో ఆలూరులో వేదావతి ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన చంద్రబాబు ఇంతవరకు దాని గురించి ఆలోచన చేయలేదు. పక్కనే ఉన్న తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రలో అక్రమ ప్రాజెక్టులు నిర్మించి కృష్ణా జలాలు రాకుండా అడ్డుకుంటున్నా ఆయన పట్టించుకోవడం లేదు. చంద్రబాబు చర్యల కారణంగా నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితులు రాబోతున్నాయి. వైయస్సార్ చేసిన పనులను తాను చేసినట్టు చెప్పుకుంటున్న చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు. చంద్రబాబు కళ్లకు అమరావతి తప్ప ఏవీ కనిపించడం లేదు. ఉద్యమాలకు సిద్ధం కావాలి - బాలనాగిరెడ్డి, మంత్రాలయం వైయస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రబాబుకి రాయలసీమ ప్రాంతమంటే ఎంత చిన్నచూపో తేలిపోయింది. రాయలసీమలో సాగునీటి రంగాన్ని ఉద్ధరించిన ఘనత వైయస్సార్, వైయస్ జగన్‌లకే దక్కుతుంది. రైతుల కోసం రాయలసీమలోని అన్ని ప్రాంతాల ప్రజలు ప్రభుత్వంపై ఉద్యమించాలి. అమరావతి తప్ప రాయలసీమ కనిపించడం లేదు - సాయిప్రసాద్ రెడ్డి, ఆదోని నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర చరిత్రలో రైతుల మేలు గురించి ఆలోచించిన నాయకులుగా తండ్రీకొడుకులు వైయస్సార్, వైయస్ జగన్‌లు చరిత్రలో నిలిచిపోతారు. రెండేళ్లు కూడా గడవకుండానే రూ. 3.50 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిన చంద్రబాబు రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్‌ను పక్కనపెట్టేశాడు. రాయలసీమలో పుట్టి కూడా రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నాడు. అమరావతి జపం చేస్తూ రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నాడు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు - కంగాటి శ్రీదేవి, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రబాబును చూసి రాయలసీమ ప్రజలు సిగ్గుపడుతున్నారు. రాయలసీమకు అన్యాయం చేసిన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో హీనుడిగా మిగిలిపోతాడు. ఆయన ఎప్పుడు సీఎం అయినా రైతులను పట్టించుకున్న పాపానపోవడం లేదు. రైతులకు మంచి చేయకపోగా, వైయస్ జగన్ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులను ఆపేయడం దుర్మార్గం. ఐక్య ఉద్యమాల ద్వారా రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్‌ను సాధించుకోవాలి. రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు - మధుసూదన్, ఎమ్మెల్సీ వైయస్సార్సీపీ హయాంలోనే 90 శాతం పనులు పూర్తయినా రాయలసీమ లిఫ్టు పనులను ఆపేసి రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. చంద్రబాబు చేస్తున్న అన్యాయాలను రాయలసీమ వ్యాప్తంగా గ్రామగ్రామానికి తీసుకెళ్లాలి. చంద్రబాబుకి బుద్ది చెప్పాలి. రాయలసీమ ప్రజల మనోభావాలను కాపాడుకుందాం. ఎన్జీటీ అనుమతులు లేవనేది సాకు మాత్రమే - బుట్టా రేణుక, మాజీ ఎంపీ దేశంలోనే వెనుకబడిన ప్రాంతంగా ఉన్న రాయలసీమకి న్యాయం చేసేలా వైయస్ జగన్ గారు సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో రాయలసీమ ప్రాజెక్టుల వైపు కన్నెత్తి చూసిన పాపానపోవడం లేదు. నిత్యంఅమరావతి రాజధాని నిర్మాణం పేరుతో హడావుడి చేయడం తప్పించి ఏ ఒక్కరోజూ రాయలసీమ అభివృద్ధిపై అడుగు పడలేదు. పక్క రాష్ట్ర తెలంగాణలో శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుపుకొంటుంటే చంద్రబాబు మాత్రం పర్యావరణ అనుమతులు లేవనే సాకు చూపించి పూర్తి కావొచ్చిన ప్రాజెక్టులను సైతం పక్కన పెట్టేశాడు. భవిష్యత్తులో రాయలసీమ ఉద్యమం - ఎస్వీ విజయమనోహరి, వైయస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రాయలసీమ వాసులంతా ఒక్కటై సంఘటితంగా ఉద్యమించకపోతే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి చేస్తున్న ద్రోహంపై గడపగడపకు అవగాహన కల్పించాలి. రాయలసీమ లిఫ్టు ఆపేస్తే జరిగే నష్టం గురించి వివరించాలి. రాయలసీమ వ్యాప్తంగా భవిష్యత్తులో వైయస్సార్సీపీ చేపట్టబోయే ఉద్యమానికి అందరూ కదలిరావాలి. శంకుస్థాపనలు చేయడం తప్ప చంద్రబాబు చేసింది శూన్యం - పాపిరెడ్డి, కర్నూలు జెడ్పీ చైర్మన్ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు వైయస్ జగన్ గారు సీఎం అయ్యాక మోక్షం లభించింది. ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటికీ నీటి లభ్యత ఉండేలా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ముందుచూపుతో ఆలోచించి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుకు వైయస్ జగన్ గారు శ్రీకారం చుట్టారు. కానీ చంద్రబాబు రేవంత్ రెడ్డి కోసం ప్రాజెక్టును పక్కనపెట్టేసి రాయలసీమ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం తప్ప చంద్రబాబు చేసింది శూన్యం. పనులు ఆపేయడమే చంద్రబాబుకి తెలిసిన విద్య - గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ పరిశీలకుడు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో శంకుస్థాపనలు చేయడం మినహా చంద్రబాబు ఏనాడూ రూపాయి ఖర్చు చేయడు. వైయస్సార్, వైయస్ జగన్‌లు పెట్టిన పేర్లు తీసేయడం, పనులు ఆపేయడమే చంద్రబాబుకి తెలిసిన విద్య. ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు. అబద్ధాలు చెప్పడమే చంద్రబాబు అనుభవం - బీవై రామయ్య, మాజీ మేయర్ రాయలసీమ ప్రాంతంలో పుట్టి కూడా ఈ ప్రాంతానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నాడు. రాయలసీమ ప్రాంతానికి వైయస్ జగన్ గారు తీసుకొచ్చిన సంస్థలను అమరావతికి తరలించిన ద్రోహి చంద్రబాబు. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు ఆపేసి దుర్మార్గంగా వ్యవహరించాడు. చంద్రబాబు అనుభవాన్నంతా అబద్ధాలు చెప్పడానికి, మోసం చేయడానికే వాడుతున్నాడు.