పూడి శ్రీహరి చేసిన త‌ప్పేంటి?

అక్రమ అరెస్టుపై పేర్ని నాని ఫైర్ 

కృష్ణాజిల్లా:   వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరి అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్టును దుర్మార్గంగా పేర్కొంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ..“పూడి శ్రీహరిని దుర్మార్గంగా అరెస్ట్ చేశారు. నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు ఆయనను అరెస్ట్ చేశారు. ఏం నేరం చేశార‌ని శ్రీహరిని అరెస్ట్ చేయించారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఒక విలేకరిగా ఎదిగి పైకొచ్చిన వ్యక్తి పూడి శ్రీహరి. మీరు చేసేది చట్టబద్ధమైన చర్య అయితే ప్రెస్ మీట్ పెట్టి శ్రీహరిని అరెస్ట్ చేయించండి. శ్రీహరి ఏమైనా మర్డర్లు చేశాడా? నేరాలు చేశాడా? ఎవరిని భయపెట్టడానికి మీరు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తున్నారు చంద్రబాబు? సోషల్ మీడియా కేసుకు ఇలా తీసుకెళ్తారా?

జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఆఫీస్ నుంచి, బాలకృష్ణ ఇంటి ఐపీ అడ్రస్ నుంచి నీచమైన పోస్టులు పెట్టించారు. అప్పుడు మిమ్మల్ని, మీ పక్కన ఉన్నవారిని ఇలాగా ఎత్తుకుపోయారా? చంద్రబాబు మీరు ఏం నేర్పిస్తున్నారు? మీ తప్పులను ప్రశ్నిస్తున్నందుకు 20 నెలల నుంచి అందరినీ లోపల వేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నవారిని భయపెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు మంగళహారతి పాడేందుకు జనం సిద్ధమైపోయారు. టిడిపి వాళ్ల కళ్లల్లో ఆనందం కోసం పోలీసు వ్యవస్థ ఇంతలా దిగజారిపోవాలా? డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు గతంలో కృష్ణాజిల్లా ఎస్పీగా మంచిగా పనిచేశారు. డీజీపీ గారూ, ఏమైపోయింది మీరు చూపిన ధైర్యం?  తప్పుడు కేసులు పెట్టి శ్రీహరిని 15 రోజులు జైల్లో పెట్టగలరు.. అంతకంటే ఏం చేయగలరు? జైలు నుంచి బయటికి వచ్చాక జగన్ మోహన్ రెడ్డి దగ్గర పనిచేయకుండా ఆపగలరా? శ్రీహరి నిజంగానే తప్పు చేస్తే మీడియా సమావేశం పెట్టి అరెస్ట్ చేయొచ్చు కదా? దొంగతనంగా ఎత్తుకెళ్లడం దేనికి? కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు సీజ్ చేయడం దేనికి? వైసిపి వాళ్ల దగ్గర సీజ్ చేసే పరికరాలు పెట్టుకోవడానికి పోలీసుల వద్ద బీరువాలు సరిపోవడం లేదు.

ఎవరిని భయపెట్టదామనుకుంటున్నారు? జగన్ దగ్గర ఉన్నవారిని భయపెట్టాలనుకుంటున్నారా? లోకేష్ ఒక్కరికే విద్య తెలుసు అనుకుంటున్నాడా?  పద్ధతి కాదనే ఇలాంటి తప్పుడు పోకడలకు ఏ ప్రభుత్వాలు పోలేదు. రాజకీయ కక్షల కోసం పోలీసులను వాడుకున్న వాడు బతికిబట్టకట్టలేదు చంద్రబాబు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని నీతులు చెప్పడం సరైంది కాదు. ఏపీలో పోలీసు వ్యవస్థను పతనావస్థకు తీసుకెళుతున్నారు. మీ కొడుకు మాటలు విని వ్యవస్థను నాశనం చేస్తే.. పరిణామాలు మీరు అనుభవించాల్సి వస్తుంది చంద్రబాబు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు పెట్టినంత మాత్రాన మమ్మల్ని ఏం చేయలేరు చంద్రబాబు. మీ కేసులు, అరెస్టులు జగన్ మోహన్ రెడ్డి వెంట జెండా మోయకుండా ఆపలేవు. ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం చంద్రబాబు మానుకోవాలి. లోకేష్ కూడా ఇలాంటి తప్పుడు పనులు మానుకోవాలి” అని పేర్ని నాని హెచ్చరించారు.
 

Back to Top