అనంతపురం : కూటమి ప్రభుత్వంలో బీసీ వర్గాలపై జరుగుతున్న అన్యాయాలు, నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడు ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న “బీసీ గళం” బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. బీసీల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పథకాలు నిలిచిపోయాయని, ఉపాధి అవకాశాలు తగ్గాయని, విద్య మరియు సంక్షేమ రంగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. బీసీ వర్గాల హక్కుల కోసం గళమెత్తే వేదికగా “బీసీ గళం” సభ నిలవనుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ బహిరంగ సభలో బీసీ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు నాయకులు తెలిపారు. ఘనంగా భగీరథ మహార్షి జయంతి అనంతపురం నగరంలోని వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో భగీరథుని జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భగీరథ మహార్షి చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. అనంతరం సగరులకు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.