ఇరిగేషన్ అధికారులను నిలదీసిన ఎంపీ అవినాష్ రెడ్డి 

వైయ‌స్ఆర్ జిల్లా : ఎత్తిపోతల పథకాల నిర్వహణలో లోపాల వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స‌తీష్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులను నిలదీశారు.
పులివెందులలోని ఇరిగేషన్ కార్యాలయానికి రైతులతో కలిసి చేరుకున్న వారు, ఎత్తిపోతల పథకాల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా మోటార్ల మరమ్మత్తులు ఆలస్యం కావడంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశాల మేరకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను గట్టిగా ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఇరిగేషన్ అధికారులు, వారంలోగా మోటార్ల మరమ్మత్తులు పూర్తి చేసి, అన్ని ఎత్తిపోతల పథకాలకు సక్రమంగా నీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన గడువులో పనులు పూర్తి చేయకపోతే రైతులతో కలిసి ఇరిగేషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని ఎంపీ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిలు హెచ్చరించారు.
 

Back to Top