అనంతపురం: వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరి అక్రమ అరెస్టును అనంతపురం జిల్లాలో వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..“ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ అరాచకాలు మరింత పెరిగాయి. అంబేద్కర్ జయంతి రోజున కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడడం నారా లోకేష్ నీచ సంస్కృతికి నిదర్శనం. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి విలువ లేదా? పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పూడి శ్రీహరి తప్పు చేసుంటే చట్ట ప్రకారం 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ జరపాలి. కానీ అలా చేయకుండా అక్రమంగా నిర్భంధించడం అప్రజాస్వామిక చర్య. పూడి శ్రీహరి అక్రమ నిర్భందం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. ఇలాంటి చర్యలు ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా ఉన్నాయి. రాజకీయంగా వేధించడమే లక్ష్యంగా ఈ అరెస్టులు చేస్తున్నారు” అని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని, అక్రమ చర్యలను సహించబోమని వారు స్పష్టం చేశారు.