బీటెక్ రవిపై వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ నాయకుల ఫైర్ 

వైయస్ఆర్ జిల్లా: అంబేద్కర్ జయంతి వేడుకలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ నేత బీటెక్ రవిపై పులివెందుల వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను అవమానించేలా మాట్లాడడం హేయమైన చర్య అని మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరైన ప్రజలకు అల్పాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన టెంటును “చిల్లర చేష్టలు”గా అభివర్ణించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. సామాజిక సేవను కూడా రాజకీయంగా విమర్శించడం తగదని పేర్కొన్నారు. పులివెందులలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడానికి వైయ‌స్ కుటుంబం అందించిన సహకారం గుర్తు చేశారు. అలాగే విజయవాడ నడిబొడ్డున భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా అంబేద్కర్ పట్ల గౌరవాన్ని చూపింది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి అని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు, దళితుల సంక్షేమంపై నిజమైన చిత్తశుద్ధి వైయ‌స్ఆర్‌సీపీకి మాత్రమే ఉందని పేర్కొంటూ, జయంతి వేడుకలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బీటెక్ రవి అవివేకానికి నిదర్శనమని విమర్శించారు.

 

Back to Top