కూటమి రెండేళ్ల పాలన అట్టర్ ఫెయిల్యూర్...

పాత ప్రాజెక్టులకే బాబు శంకుస్థాపనలు

మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ధ్వజం.

విశాఖపట్నం లోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్.

సగం పదవీకాలం ముగిసిన హామీల అమల్లో ప్రభుత్వం పెయిల్

వైయస్.జగన్ అన్ని అనుమతులు తెచ్చిన ప్రాజెక్టుకే మరలా శంకుస్థాపన

చంద్రబాబు నేతృత్వంలోని ఇది క్రెడిట్ చోరీ ప్రభుత్వం 

ఎన్నికల హామీలపై టీడీపీ బీఎల్ ఏ లను నిలదీస్తున్న ప్రజలు

ఫలితంగా ఎన్యుమరేషన్ కి డుమ్మా కొడుతున్న టీడీపీ బీఎల్ ఏలు  

రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత ఫెయిల్యూర్ క్యాబినెట్ 

మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ స్పష్టీకరణ. 

విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సగం పదవీకాలం ముగిసినా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోనూ, కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమైందని  వైయ‌స్ఆర్‌సీపీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం విశాఖపట్నం వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైయస్.జగన్ హయాంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ, క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో మంత్రులు వారి సొంత శాఖల గురించి తప్ప మిగిలిన అన్ని శాఖల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదొక అత్యంత ఫెయిల్యూర్ క్యాబినెట్ అని ఆయన తేల్చి చెప్పారు. వేదిక ఏదైనా సరే వైయ‌స్ఆర్‌సీపీని తిట్టడమే చంద్రబాబు నాయుడి ఏకైక లక్ష్యమని.. అంతర్జాతీయ వేదికల మీదకు వెళ్లినా కూడా చంద్రబాబు జగన్నామస్మరణే చేస్తున్నారని మండిపడ్డారు. 

ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...

- కడప స్టీల్ ప్లాంట్‌పై క్రెడిట్ చోరీ..

వైయస్.జగన్ హయాంలో పరిశ్రమల శాఖ మంత్రిగా నేను ఉన్నప్పుడే జేఎస్ డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ సమక్షంలో కడప స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన చేశాం. ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన 3 వేల ఎకరాల భూమి, గండికోట నుంచి 2 టీఎంసీల నీరు, పవర్ సప్లై కోసం హెచ్ టీ లైన్, జాతీయ రహదారి-67 అనుసంధానం మరియు రైల్వే కనెక్టివిటీ వంటి అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ 2022 డిసెంబరు 21న మా ప్రభుత్వమే జీవో జారీ చేసింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిందాల్ సంస్థపై కక్ష కట్టి, ముంబాయి నుంచి ఒక నటిని తెచ్చి కేసులు పెట్టించి నానా రాద్ధాంతం చేశారు. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి, రెండేళ్ల పాటు పనులు నిలిచిపోయేలా చేసి వేలాది కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోయేలా చేశారు. అన్ని పనులను మేమే పూర్తి చేస్తే, ఇప్పుడు తీరిగ్గా వచ్చి చంద్రబాబు నాయుడు మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు.

- చంద్రబాబు అంతర్జాతీయ మేస్త్రీ సంఘం అధ్యక్షుడు..

దేశంలో, రాష్ట్రంలో ఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా అది 'నా వల్లే' అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు. హైటెక్ సిటీ, చార్మినార్, సెల్ ఫోన్ అన్నీ తన వల్లే వచ్చాయనడానికి ఆయన వెనకాడరు. 2017లో చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేసినప్పుడు ఒక మేస్త్రీ, ఇటుకలు, సిమెంట్ తప్ప ఆయన దగ్గర భూమితో సహా ఏమీ లేదు. 
చంద్రబాబు విధానం 'చెల్లికి జరగాలి పెళ్లి మళ్లీ మళ్లీ' అన్నట్టు ఉంటుంది. ఆయన వేసినన్ని శిలాఫలకాలు దేశంలో ఏ నాయకుడూ వేసి ఉండడు. వేదిక ఏదైనా వైయస్.జగన్ ను, వైయ‌స్ఆర్‌సీపీని వ్యక్తిగతంగా దూషించడమే చంద్రబాబు అజెండా.

- మహిళా కమిషన్ నోటీసులు - చంద్రబాబు పచ్చి అబద్ధాలు..

మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు బాధ్యత గల పౌరుడిగా నేను వ్యక్తిగతంగా హాజరై సమాధానం ఇచ్చాను. నా వ్యాఖ్యలు రాజకీయ పరమైనవే తప్ప మహిళా లోకంపై చేసినవి కావని స్పష్టం చేశాను. కానీ చంద్రబాబు నాయుడు నిన్న నెల్లూరు సభలో మాట్లాడుతూ.. నేను మహిళా కమిషన్ ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడానని పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. నన్ను, మా నాయకుడిని సైకో అని విమర్శిస్తున్న చంద్రబాబు.. గతంలో టీడీపీ నేతలు మహిళల పట్ల ప్రవర్తించిన తీరుపై సమాధానం చెప్పాలి.

- టీడీపీ నేతల భాషను ప్రోత్సహించిన సైకో ఎవరు?

గతంలో మా ప్రభుత్వంలోని మహిళా మంత్రిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అత్యంత దారుణంగా మాట్లాడినప్పుడు ఏ సైకో ప్రోత్సహించాడు?. బహిరంగ వేదికపై "ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి" అని చంద్రబాబు బావమరిది బాలకృష్ణ మాట్లాడటానికి ఏ సైకో కారణం?.  మా మహిళా నేతపై రూ.2వేలు, రూ.3వేలకు ఏ పనైనా చేస్తుందని నీచంగా మాట్లాడిన చిత్తూరు జిల్లా (నగరి) ఎమ్మెల్యే వెనుక ఉన్న సైకో ఎవరు?. ఒక మహిళకు ఐదుసార్లు అబార్షన్ చేయించి, నడిరోడ్డుపై కొట్టించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పక్కన నిలబడి మాట్లాడటానికి చంద్రబాబుకు ఏ సైకో ధైర్యం ఇచ్చాడు? కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ పై నడిరోడ్డు మీద దాడి చేయించి బూతులు తిట్టించిన సైకో ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 

"ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు" అని, "కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా" అని దళితులను, మహిళల పుట్టుకను అవహేళన చేసిన అసలైన సైకో ఎవరో అందరికీ తెలుసు.

- ప్రజల నిలదీతతో పారిపోతున్న టీడీపీ బీఎల్ ఏలు..

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి ఎన్యూమరేషన్ (SIR) కార్యక్రమంలో టీడీపీ బీఎల్ ఏలు ప్రజల ఇళ్లకు వెళ్తుంటే స్థానికులు వారిని నిలదీస్తున్నారు.  సూపర్ సిక్స్ హామీల ప్రకారం ప్రతి ఆడబిడ్డకు నెలకు ఇస్తామన్న రూ.1500 ఏమైంది? నిరుద్యోగ భృతి రూ.3000 ఎందుకు ఇవ్వడం లేదు? కొత్త పెన్షన్ల దరఖాస్తులు ఎందుకు తీసుకోవడం లేదు?అని ప్రజలు ప్రశ్నిస్తుండటంతో, భయపడి గత రెండు రోజులుగా టీడీపీ బీఎల్ ఏలు ఎన్యూమరేషన్‌కు రావడం లేదు. వెన్నుపోటుకు, నమ్మకద్రోహానికి ఈ దేశంలో పేటెంట్ హక్కుదారు చంద్రబాబు నాయుడే. పిల్లనిచ్చిన మామకు, జన్మనిచ్చిన రాయలసీమకు, నమ్మిన ప్రజలకు మరియు భూములిచ్చిన అమరావతి రైతులకు వెన్నుపోటు పొడిచిన ఏకైక వ్యక్తి చంద్రబాబు.

- ఆర్థిక లోపాలు - అయినా గొప్పలు..

ఏపీ జీఎస్టీ రెవెన్యూస్ లో ఈ ఏడాది 21 శాతం పెరిగిందని మంత్రి లోకేష్ చెప్పాడు. సీఏజీఆర్ చూస్తే 7.5 శాతం ఉంది. 2019 -24 వరకు కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు ఉన్నా.. వైయస్.జగన్ హయాంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో సీఏజీఆర్ 8.5 శాతంతో  మంచి ఆదాయాలు సాధించాం.2024-25 కూటమి జీఎస్టీ రెవెన్యూ చూస్తే మైనస్ 7 శాతం ఉంది. 2025-26 నాటికి ప్లస్ 21 శాతం ఉంది.. చాలా గణనీయంగా పెరిగిందని గొప్పులు చెప్పుకుంటున్నారు.  పరిపాలన ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వానికి మైనస్ మార్కులు వచ్చాయి. అడిగితే నేను స్టాన్ ఫర్డ్ లో చదువుకున్నానని లోకేష్ చెబుతున్నారు. డబ్బులు ఉంటే చదువును ఎక్కడైనా కొనుక్కోవచ్చు కాబట్టే ఆయన విదేశాలకు వెళ్లి చదివారు. ఇప్పటికైనా కులరాజకీయాలు మానుకుని యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలి.

- రాష్ట్రంలో అట్టర్ ఫెయిల్యూర్ క్యాబినెట్..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ చట్టం తీసుకొచ్చినా అది రాష్ట్ర ప్రజలందరికీ ఒకేలా వర్తించాలి కానీ ఒక వర్గానికో, పార్టీకో కొమ్ముకాసేలా ఉండకూడదు. కూటమి నేతలు మమ్మల్ని ఏం అన్నా పర్వాలేదు కానీ, మేం ప్రశ్నిస్తే మాత్రం అక్రమ కేసులు పెడుతున్నారు.
కూటమి ప్రభుత్వంలో మంత్రులు వారి సొంత శాఖల గురించి తప్ప మిగిలిన అన్ని శాఖల గురించి మాట్లాడుతున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ లా అండ్ ఆర్డర్, పరిశ్రమల గురించి మాట్లాడటం ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రి వర్గం అన్ని రంగాల్లోనూ అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇదొక అత్యంత ఫెయిల్యూర్ క్యాబినెట్ గా మిగిలిపోతుందని గుడివాడ అమర్నాధ్ తేల్చి చెప్పారు.

Back to Top