న్యూఢిల్లీ : విజయవాడ కృష్ణలంకకు చెందిన గాడె సాయికృష్ణ అనుమానాస్పద మృతి, పి. క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తక్షణ జోక్యం చేసుకోవాలని వైయస్ఆర్‌సీపీ ఎంపీలు మద్దిల గురుమూర్తి, గుమ్మా తనూజారాణి కోరారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్‌ను కలిసి రెండు ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. సాయికృష్ణ మృతి ఘటనలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, పోలీసుల అధికారం దుర్వినియోగం, కస్టడీ హింసకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని ఎంపీలు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాలు అనుమానాలకు తావిస్తున్నాయని, ఆయన కుటుంబ సభ్యులు కస్టడీలో హింస, శారీరక వేధింపులు, ఆచూకీపై సమాచారం ఇవ్వకపోవడం వంటి అంశాలపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. సాయికృష్ణ నిర్బంధం, కస్టడీ, మృతికి దారితీసిన పరిస్థితులపై స్వతంత్ర, నిష్పాక్షిక, కాలపరిమితి గల విచారణ జరిపించాలని కోరారు. అదేవిధంగా క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనను కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల వేధింపుల కారణంగానే క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. మరణానికి ముందు క్రాంతికుమార్ స్వయంగా రికార్డు చేసినట్లు చెబుతున్న వీడియోలో కృష్ణలంక సీఐ నాగరాజుపై నిరంతర వేధింపులు, మానసిక చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. వైరల్ వీడియోతో పాటు మొబైల్ ఫోన్ రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను భద్రపరచి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాలని కమిషన్‌ను కోరారు. ఈ రెండు ఘటనల్లోనూ ఒకే పోలీసు అధికారిపై ఆరోపణలు రావడం అత్యంత ఆందోళనకర విషయమని ఎంపీలు పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం, కస్టడీ హింస, బెదిరింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన విస్తృతమైన నమూనా ఈ ఘటనల్లో కనిపిస్తోందా అనే కోణంలో కూడా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత రికార్డులన్నింటినీ పరిశీలించి, గత ఫిర్యాదులు, క్రమశిక్షణ చర్యల చరిత్రను కూడా పరిశోధించాలని కోరారు. అవసరమైతే స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపేలా ఎన్‌హెచ్‌ఆర్‌సీ సిఫారసు చేయాలని ఎంపీలు అభ్యర్థించారు. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలు రాష్ట్రంలో పోలీసు జవాబుదారీతనం, అధికార దుర్వినియోగం, ప్రాథమిక హక్కుల పరిరక్షణపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించాయని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా, దోషులపై బాధ్యత నిర్ధారించి చర్యలు తీసుకునేలా ఎన్‌హెచ్‌ఆర్‌సీ అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని, రాజ్యాంగ విలువలు, మానవ గౌరవం, న్యాయ పాలన పరిరక్షణ కోసం స్వతంత్ర విచారణ నిర్వహించాలని ఎంపీలు మద్దిల గురుమూర్తి, గుమ్మా తనూజారాణి విజ్ఞప్తి చేశారు.