రాజమండ్రి: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి రాంబాబుకు బుధవారం బెయిల్ మంజూరు కావడంతో ఇవాళ ఉదయం గుంటూరు బయల్దేరారు. అయితే పోలీసులు అంబటి రాంబాబుకు అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. అంబటి వాహనం వెనుక మూడుకు మించి వాహనాలు ఉండకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు వాహనం బయల్దేరిన వెంటనే కాన్వాయ్‌గా వస్తున్న పలు వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో జక్కంపూడి రాజాతో పాటు పలువురు వైయస్ఆర్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఆయన ప్రయాణిస్తున్న వాహనం దిగి వెనక్కి వచ్చారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు అనుమతిస్తే గుంటూరుకు కారులో వెళతా.. లేకపోతే గుంటూరుకు పాదయాత్రగా వెళతా’ అంటూ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తీరు దారుణంగా ఉందంటూ మండిపడ్డారు. 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళుతున్న వారిపై ఈ తరహా దాష్టీకం చేయడం సరికాదన్నారు. ఇంతకన్నా ఏం చేయగలరు? ‘రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి నెలకొంది. ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంతకన్నా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టగలరు’ అంటూ ధ్వజమెత్తారు. తన ఇల్లును పగలగొట్టినప్పడు 30 యక్ట్ లేదా.. ఇప్పుడు 30 యాక్ట్ వచ్చిందా అంటూ అంబటి ప్రశ్నించారు. పోలీసులు దగ్గరుండి తన ఇల్లును పగలగొట్టించారని, ఆ రోజు ఏమైంది 30 యాక్ట్ అంటూ నిలదీశారు. తాను శాంతియుతంగా గుంటూరుకు వెళుతున్నానని, మీరు కారులో వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోతే మాత్రం పాదయాత్రగా గుంటూరుకు వెళతా అంటూ హెచ్చరించారు. అంబటి కాన్వాయ్‌ను పదే పదే అడ్డుకున్నారు.