కర్నూలు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు దిగుతోందని వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. కర్నూలులోని తనకు చెందిన ఎస్వీ కాంప్లెక్స్‌లో విజిలెన్స్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోలేక అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఒత్తిళ్లు తీసుకువస్తున్నారని విమర్శించారు. ఎస్వీ కాంప్లెక్స్‌కు 2005లోనే బిల్డింగ్ రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన అనుమతులు (బీఆర్‌ఎస్) తీసుకున్నామని తెలిపారు. అన్ని నిబంధనలకు అనుగుణంగానే భవనం నిర్మాణం జరిగిందని, అయినప్పటికీ తనిఖీల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కర్నూలు నగరంలో అధికార పార్టీ నాయకులకు చెందిన పలు భవనాలపై కూడా ఆరోపణలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోని అధికారులు ప్రతిపక్ష నాయకులపైనే ప్రత్యేక దృష్టి సారించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లకు తాము భయపడబోమని స్పష్టం చేసిన ఎస్వీ మోహన్ రెడ్డి, కక్షసాధింపు చర్యలు, అధికారుల వేధింపులపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించడం కొనసాగుతుందని, రాజకీయ కక్షలతో వైయస్ఆర్‌సీపీ నాయకులను అణగదొక్కే ప్రయత్నాలు ఫలించవని అన్నారు.