ఎల్లుండి భీమవరం పర్యటనకు వైయస్ జగన్

 ఆక్వా రైతులను పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి

 ఆక్వా రంగం సంక్షోభంపై రైతులతో ముఖాముఖి

తాడేప‌ల్లి: ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకుని రైతులకు భరోసా కల్పించేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం (15.07.2026) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలు, నష్టాలు, ఇబ్బందులను తెలుసుకోవడంతో పాటు, వారి సమస్యల పరిష్కారం కోసం వైయస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. తాడేపల్లిలో విడుదల చేసిన పర్యటన వివరాల ప్రకారం, రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీల భారం, ఎగుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైయస్ జగన్ భీమవరం పర్యటన చేపడుతున్నారు.

ఈ సందర్భంగా ఆక్వా రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటారు. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, నష్టాలపై వివరాలు సేకరించి, వారికి ధైర్యం చెప్పనున్నారు. అలాగే ఆక్వా రంగాన్ని ఆదుకునే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రైతుల హక్కుల పరిరక్షణ కోసం వైయస్సార్‌సీపీ పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేయనున్నారు. ఆక్వా రైతుల సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన వైయస్ జగన్, ఈ పర్యటన ద్వారా బాధిత రైతులను నేరుగా కలిసి వారి తరఫున మరింత బలంగా గొంతు వినిపించనున్నారు.
 

Back to Top