తిట్టడం గొప్ప కాదు..హామీల నెర‌వేర్చ‌డ‌మే హీరోయిజం

 వైయస్ జగన్

చంద్ర‌బాబు ఏడాది పాల‌న‌లో అన్నీ దారుణాలే

ఇది దౌర్భాగ్యపు పాలన

ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి

మన హయాంలో.. కోవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చిన్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశాం

99 శాతం హామీలను అమలు చేశాం.. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేశాం

చంద్రబాబు.. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ గాలికొదిలేశారు

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం

ఈ సారి 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది

స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నాడు. మహానాడు పేరుతో తెలుగు డ్రామా పార్టీ కడపజిల్లాలో కార్యక్రమం చేస్తున్నారు. హీరోయిజం అంటే కడప జిల్లాలో మహానాడు పెట్టడం కాదు. హీరోయిజం అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చడం. అంతే తప్ప సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం హీరోయిజం ఎలా అవుతుంది? చంద్రబాబూ గుర్తుపెట్టుకో. మీ కార్యకర్తను ఇంటింటికీ తిప్పే సత్తా ఉందా అని ప్రశ్నిస్తున్నాను. ఇది వైయస్సార్సీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి తేడా.

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో బుధ‌వారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్న­మయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయ‌స్‌ జగన్ సమావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏమ‌న్నారంటే.. ‘‘రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.  మన హయాంలో.. కోవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా.. ఏరోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కనపెట్టలేదు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశాం. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ దాన్ని అమలు చేసేట్టుగా చేశాం. 99శాతం హామీలను అమలు చేశాం. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేశాం.

మీ అందరికీ హ్యాట్సాఫ్‌ 
కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక చంద్రబాబు ఏడాదిగా దౌర్భాగ్యపు పాలన చేస్తున్నారు. ఆయ‌న  ప్రానిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే అరాచకాలను ప్రోత్సహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీల్లో చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారు చంద్రబాబు కుట్రలకు తలొగ్గక విలువలు చాటారు. అందుకు మీ అందరికీ హ్యాట్సాఫ్‌ చెప్తున్నా. ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. వైఎస్సార్‌సీపీ కి చెందిన ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడు అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి పలానా వైఎస్సార్‌సీపీ వాళ్లం అని చెప్పే ధైర్యం ఉంది. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా?. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి.సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమస్యలు చెప్పి, ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వాళ్లే. ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశామ‌ని గుర్తు చేశారు.ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీ సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు’’ అని వైయ‌స్ జగన్‌ అన్నారు.

హామీల అమ‌లు ఊసే లేదు
 చంద్రబాబు.. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ గాలికొదిలేశారు.143 హామీలను పూర్తిగా పక్కనపెట్టారు.చిన్నహామీ అయిన ఉచిత బస్సుకోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్యాస్‌ సిలెండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. సీబీఎస్‌ఈ, టోఫెల్‌, నాడు-నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. మా హయాంలో ప్రతి మూడు నెలలకూ ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌, వసతి దీవెన లేదు. చదివించలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఆరోగ్య శ్రీని కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు.  పేషెంట్లకు ఆరోగ్య శ్రీ అందని పరిస్థితి నెలకొంది. పేదలు వైద్యంకోసం అప్పులు పాలు అవుతున్నారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏడాది కాలంగా రైతు భరోసా లేదు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదు. ధాన్యానికి కనీస మద్దతు ధరే కాదు, జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.1౦వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో.. పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు ధరలు రాడంలేదు.  రైతు బతుకు దళారీ పాలయ్యింది. ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగంకూడా ఇవ్వలేకపోయారు. ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారు. 2.6 లక్షల మంది వాలంటీర్లు, 15వేల మంది బెవరేజెస్‌ కార్పొరేషన్లు, రేషన్‌ వాహనాల మీద ఆధారపడ్డ 20వేల మంది ఇలా మొత్తంగా 3లక్షల ఉద్యోగాలను తీసేశారు. మన పాలనలో ఉద్యోగస్తుల్లో చంద్రబాబు విషం నింపారు. ఇప్పుడు ఒక్కరికీ ఐఆర్‌ ఇచ్చిన పాపాన పోలేదు, పీఆర్‌సీ లేదు. మూడు డీఏలు పెండింగ్‌, బకాయిలు పెండింగ్‌. చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామని ఉద్యోగులు తలపట్టుకుంటున్నారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్‌, రాజధాని పనులు.. లిక్కర్‌ ఇలా దేన్నీ వదలకుండా దోచేస్తున్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో మనం రూ.2.73లక్షల కోట్లు డీబీటీ చేశాం. వైయ‌స్ జగన్‌ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు. మరణం తర్వాత ప్రతి ఇంట్లో నేను బతికే ఉండాలని ఆశపడ్డాను. అందుకే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను. కానీ చంద్రబాబు బటన్‌ నొక్కడంలేదు, దోచేసుకోవడం, దోచేసినది పంచేసుకోవడం చేస్తున్నాడు. రాష్ట్రానికి వచ్చిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 11 శాతం పెరిగితే.. మనకు ౩శాతం పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు టీడీపీకి చెందిన గజ దొంగల ముఠా జేబుల్లోకి పోతోంది’’ అని వైయ‌స్ జగన్‌ అన్నారు.

రాసిపెట్టుకోండి.. రిటర్న్‌ గిఫ్ట్‌లు ఇద్దాం 
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు అవుతోందని, తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలూ సృష్టిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కొనసాగుతున్న కక్ష సాధింపు రాజకీయాలను ప్రస్తావిస్తూనే కూటమి కనుసన్నల్లో పని చేస్తున్న అధికారులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. `రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. పల్నాడులో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరులో హత్యలు జరిగాయి. హత్యకు ఉపయోగించిన వాహనం ఎవ్వరిదో తెలుసు, చంపిన వాళ్లు ఎవ్వరో తెలుసు. టీడీపీలో గ్రూపుల తగాదాలే దీనికి కారణమని స్వయంగా ఎస్పీ చెప్పారు. ఇప్పుడు మన పార్టీ ఇన్‌ఛార్జి పిన్నెల్లిమీద కేసులు పెట్టారు. 

ఇల్లీగల్‌ మైనింగ్‌ లేదని అధికారులు రిపోర్టు ఇస్తే.. తప్పుడు కేసు, తప్పుడు సెక్షన్లు పెట్టి మాజీ మంత్రిని కాకాణిని అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై ఘటన విషయంలో ఇప్పుడు ఆర్కేమీద కేసు పెడుతున్నారు.ఈ మధ్యకాలంలో అనేక దారుణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. చట్టం, రాజ్యాంగం ఉల్లంఘనకు గురవుతోంది` అని వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు.

కార్య‌క‌ర్త‌ల బాగోగుల‌ను చూసుకుంటాం
ఈ సారి 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు, కార్యకర్తలకూ ప్రాధాన్యత ఉంటుంది. కార్యకర్తల బాగోగులను చూసుకుంటాం. కార్యకర్తలకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నాం. అన్యాయం ఎవరు చేసినా.. మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీ సహా రిటర్న్‌ గిఫ్ట్ లు ఇస్తాం. చేసినవాళ్లే కాదు, వీళ్లతో కుట్రలు పన్నుతూ చేయించనవారినికూడా సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్డ్‌ అయినా సరే చట్టం ముందు నిలబెడతాం. అన్యాయాలు చేయడానిక వీరికి యూనిఫాం ఇవ్వలేదు. న్యాయంగా, ధర్మంగా విధులు చేయడానికి వీరికి యూనిఫాం ఇచ్చింది’’ అని వైయ‌స్ జగన్‌ అన్నారు.

Back to Top