గాదె సాయికృష్ణ‌ది ప్ర‌భుత్వ హ‌త్యే

రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగానే దారుణాలు

అందుకే నిందితులుగా సీఎం, మంత్రి లోకేష్‌, హోంమంత్రి అనిత‌ల‌ను చేర్చాలి

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్‌, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ డిమాండ్‌

విశాఖ లోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్‌, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ 

సీఐపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేశారంటే సాయికృష్ణని చంపేశార‌ని ప్ర‌భుత్వం ఒప్పుకున్న‌ట్టే

సీఐ నాగ‌రాజుని బలిచేసి మిగ‌తా పోలీసు ఉన్న‌తాధికారుల‌ను త‌ప్పించే కుట్ర 

పోలీస్ క‌మిష‌న‌ర్‌, డీజీపీ, ఇత‌ర పోలీసు సిబ్బంది పాత్ర‌పైనా విచార‌ణ జ‌ర‌గాలి 

కేసును నీరుగార్చి త‌ప్పించుకునే కుట్ర‌లో భాగంగానే తూతూమంత్రం విచార‌ణ‌

ఐజీ స్థాయి అధికారుల‌పై విచార‌ణ‌కు ఎస్పీని నియ‌మిస్తే నిజాలు బ‌య‌ట‌కొస్తాయా?

సీబీఐ విచార‌ణ జ‌రిగితే ఈ దారుణంలో పాల్గొన్న వారంద‌రికీ శిక్ష ప‌డుతుంది

ఆ త‌ల్లికి న్యాయం జ‌ర‌గాలంటే సీబీఐ రంగంలోకి దిగి విచార‌ణ చేయాల్సిందే 

కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్ సీసీ టీవీ ఫుటేజ్‌ల‌న్నీ విడుద‌ల చేయాలి

ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ 

విశాఖ‌ప‌ట్నం: కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్‌లో లాక‌ప్ డెత్‌కి గురైన‌ కాపు యువ‌కుడు గాదె సాయికృష్ణ‌ది ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్యేన‌ని, రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు కోసం పోలీసుల‌ను విచ్చ‌ల‌విడిగా వాడుకుంటున్న కారణంగానే ఈ దారుణాలు జ‌రుగుతున్నాయ‌ని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్‌, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ ధ్వ‌జ‌మెత్తారు. విశాఖలోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేష్‌, హోంమంత్రి అనిత‌ల‌ను కూడా నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. సీఐ నాగ‌రాజుపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేశారంటే సాయికృష్ణ బ‌తికే లేడ‌ని, చంపేసిన‌ట్టు ప్ర‌భుత్వం ఒప్పుకున్న‌ట్టేన‌ని, సీఐని బలిచేసి మిగ‌తా పోలీసు ఉన్న‌తాధికారుల‌ను త‌ప్పించే కుట్ర జ‌రుగుతోంద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. కేసును నీరుగార్చి త‌ప్పించుకునే కుట్ర‌లో భాగంగానే  ఐజీ స్థాయి అధికారుల‌పై విచార‌ణ‌కు ఎస్పీని నియ‌మించార‌ని వివ‌రించారు. ఆ త‌ల్లికి న్యాయం జ‌ర‌గాలన్నా, ఈ దారుణంతో సంబంధం ఉన్న వారంద‌రికీ శిక్ష ప‌డాల‌న్నా సీబీఐతో విచార‌ణ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఏ త‌ప్పూ చేయ‌న‌ట్ట‌యితే కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్ సీసీ టీవీ ఫుటేజ్‌ల‌న్నీ విడుద‌ల చేయాలని గుడివాడ అమ‌ర్నాథ్ డిమండ్ చేశారు. 

ఆయ‌న ఇంకా ఏం మాట్లాడారంటే... 

- రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాల‌న సాగుతోంది

కూటమి పాల‌న ఇలాగే కొన‌సాగితే రాష్ట్ర భ‌విష్య‌త్ త‌రాల ప‌రిస్థితి ఏమైపోతుందోన‌న్న ఆవేద‌న క‌లుగుతోంది. గాదె సాయికృష్ణ అనే 23 ఏళ్ల యువ‌కుడిని కృష్ణ‌లంక పోలీసులు లాక‌ప్‌లోనే అతి దారుణంగా హింసించి చంపేసిన దారుణం చూస్తే ఒళ్లు గ‌గుర్పొడుస్తోంది. త‌న కొడుకుని చూపించ‌మ‌ని పోలీస్ స్టేష‌న్ చుట్టూ తిరుగుతూ నెల‌రోజుల పాటు ఆ త‌ల్లి ప‌డిన క‌ష్టం, ఇప్పుడు కొడుకు బ‌తికి లేడ‌ని, ఆఖ‌రి చూపు కూడా ద‌క్క‌లేద‌ని తెలిసి క‌న్నీరు మున్నీర‌వుతున్న తీరు చూస్తే ఎవ‌రికైనా గుండె త‌రుక్కుపోతోంది. చివ‌రికి న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించి హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్ వేస్తే త‌ప్ప కొడుకు లేడ‌న్న విష‌యమైనా ఇత‌ర మార్గాల్లో వెలుగులోకి వ‌చ్చింది. సీఐ నాగ‌రాజుపై హ‌త్యాయ‌త్నం సెక్ష‌న్ కింద పెట్టిన కేసుతో లాక‌ప్‌లోనే చంపేశార‌ని పోలీసులు, ప్ర‌భుత్వం అంగీక‌రించిన‌ట్ట‌యింది. లాక‌ప్ లో హింసించి చంప‌డ‌మే కాకుండా ఆఖ‌రుకి బూడిద కూడా లేకుండా చేసిన దుర్మార్గం దేశంలో ఏ రాష్ట్రంలోనూ జ‌రిగి ఉండ‌దు. ఇటువంటి ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్న చంద్ర‌బాబు సిగ్గుప‌డాలి. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా గాడి త‌ప్పాయి. గాదె సాయికృష్ణ ఘ‌ట‌నతో రెడ్‌బుక్ అరాచ‌కాలు పరాకాష్ట‌కు చేరిన‌ట్టు క‌నిపిస్తోంది. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాల‌న సాగుతోంది.

- నేర‌స్తుల‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించి హ‌క్కు పోలీసుల‌కు ఎవ‌రిచ్చారు?

సాయికృష్ణ‌కు గోర్లు పీకేసి తీవ్రంగా హింసించార‌ని తెలుస్తోంది. అస‌లు నేర‌స్తుల‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించి హ‌క్కు పోలీసుల‌కు ఎవ‌రిచ్చారు?  సాయికృష్ణ ప‌ట్ల సీఐ నాగరాజు వ్య‌వ‌హ‌రించిన తీరు దేశం ముందు ఏపీ పోలీస్ వ్య‌వ‌స్థ త‌ల‌దించుకునేలా ఉంది. చ‌ట్టాన్ని అతిక్రమించి కూట‌మి నాయ‌కులకు వంత‌పాడే పోలీసులు ఇప్ప‌టికైనా బుద్ధి తెచ్చుకోవాలి. పొలిటిక‌ల్ బాస్‌ల ఆదేశాల‌తో కాకుండా చ‌ట్ట‌ప్ర‌కారం న‌డుచుకోవాలి. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి కూట‌మి నాయ‌కులు క‌క్షలు, ప్ర‌తీకార రాజ‌కీయాల‌కు పోలీసుల‌ను వాడుకుంటున్న విధానాలే ఇప్పుడీ దుస్థితికి కార‌ణం. ఇది ఖచ్చితంగా ప్ర‌భుత్వం చేసిన హ‌త్యే. దీనికి లా అండ్ ఆర్డ‌ర్ ని ప‌ర్య‌వేక్షిస్తున్న‌ సీఎం చంద్ర‌బాబు, రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో హ‌ల్ చ‌ల్ చేసిన మంత్రి లోకేష్‌, హోంమంత్రి అనిత‌లను కూడా గాదె సాయికృష్ణ కేసులో నిందితులుగా చేర్చాలి. సీఐని మాత్ర‌మే బ‌లిచేసి సీపీ, డీజీపీ, ఇత‌ర పోలీస్ అధికారులంతా త‌ప్పించుకోవాల‌ని చూస్తున్నారు. అంద‌రికీ శిక్ష‌ప‌డాలి. ఐజీ మీద విచార‌ణ‌కు ఎస్పీని నియమించ‌డం చూస్తే తూతూమంత్రంగా విచార‌ణ చేసి కేసును నీరుగార్చే ప్ర‌య‌త్నంగానే క‌నిపిస్తోంది. సీబీఐ విచార‌ణ జ‌రిగితే త‌ప్ప నిజానిజాలు బ‌య‌ట‌కు రావు. ఆ త‌ల్లికి న్యాయం జ‌ర‌గాలంటే సీబీఐ విచార‌ణతోనే సాధ్యం. 

- కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక 790 హ‌త్య‌లు

రాష్ట్రంలో పోలీసులు 70 వేల సీసీ కెమెరాలు అమ‌ర్చార‌ని గొప్ప‌గా చెబుతున్న హోంమంత్రి అనిత‌, ఇప్పుడు కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్ లో సాయికృష్ణ‌ని ఎలా విచారించారో ఆ ఫీడ్ మొత్తం కోర్టు ముందుంచాలి. వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల ముందుకు తీసుకురావాలి. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక 790 హ‌త్య‌లు జ‌రిగితే అందులో రాజ‌కీయ క‌క్ష‌ల‌తో 30 మందిని పొట్ట‌న‌బెట్టుకున్నారు. వంద‌ల మంది మ‌హిళ‌లు, చిన్నారుల‌పై అత్యాచారం చేశారు. చిన్నారి జ్ఞానేశ్వ‌రి అదృశ్య‌మై 20 రోజుల‌వుతున్నా ఇంత‌వ‌ర‌కు పోలీసులు ఆచూకీ క‌నిపెట్ట‌లేక‌పోయారు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ముచ్చుమ‌ర్రిలో అదృశ్య‌మైన బాలిక మృత‌దేహం ఇంత‌వ‌ర‌కు పోలీసులు వెతికి పట్టుకురాలేక‌పోయారు. 

- లాక‌ప్ డెత్ జ‌రిగితే మేక‌ప్ తో డైవ‌ర్ష‌న్

లాక‌ప్ డెత్ జ‌రిగితే మేక‌ప్ తో డైవ‌ర్ష‌న్ చేసే కుట్ర‌కు తెర‌లేపారు. ఈవీఎంల గురించి చ‌ర్చ జ‌రుగుతుంటే ల‌డ్డూ విష‌యం తీసుకొచ్చారు. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ గురించి వైయ‌స్సార్సీపీ ఉద్య‌మిస్తుంటే, గొడ్డ‌లి పార్టీ అని విష ప్ర‌చారం మొద‌లుపెట్టారు. డీఎస్సీలో అక్రమాలను నిగ్గుతేల్చాల‌ని డిమాండ్ చేస్తుంటే త‌ల్లి, చెల్లి అని మాట్లాడుతున్నారు. వైయ‌స్సార్సీపీ లేవ‌నెత్తిన ఏ ప్ర‌శ్న‌కూ సూటిగా స‌మాధానం ఇచ్చే ద‌మ్ము కూట‌మి నాయ‌కుల‌కు లేదు. ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ప్పుడు తూతూమంత్రంగా క‌మిటీలు వేసి కాల‌యాప‌న‌తో మ‌సిపూసి మారేడుగాయ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎక్క‌డా నిజాల‌ను నిగ్గుతేల్చే ధైర్యం చేయ‌డం లేదు. నాడు కాపు నాయ‌కుడు వంగ‌వీటి మోహ‌న రంగాని అత్యంత దారుణంగా హ‌త్య చేసిన తెలుగుదేశం ప్ర‌భుత్వానికి సాయికృష్ణ‌ని చంప‌డం ఏమంత క‌ష్టం కాదు. సాయికృష్ణ లాక‌ప్‌డెత్ గురించి ప్ర‌శ్నిస్తుంటే రాజ‌కీయ రంగు పులిమి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేయ‌డం మానుకోవాలి. సాయికృష్ణ కుటుంబం జ‌న‌సేన పార్టీ కోసం ప‌నిచేసిన చ‌రిత్ర ఉంద‌ని తెలిసి కూడా నిస్సిగ్గుగా మాట్లాడటం సిగ్గుచేటు. డ‌బ్బులిచ్చి వారి నోళ్లు మూయించాల‌న్న చౌక‌బారు రాజ‌కీయాలు మానుకోవాలని గుడివాడ అమ‌ర్నాథ్ హిత‌వు ప‌లికారు.

Back to Top