కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి బుద్ధి చెప్పండి 

 గుర్తింపు కార్డుల పంపిణీలో అనంత వెంకటరామిరెడ్డి 

 అనంతపురం: కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని, ప్రజలకు అండగా ఉండాల్సిన వారే ప్రజాభక్షకులుగా మారిపోతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ప్రశాంతతకు నిలయమైన అనంతపురం నగరంలో ప్రజల ఆస్తులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతపురం అర్బన్‌ పరిధిలోని ఏ. నారాయణపురం పంచాయతీకి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు అనంత వెంకటరామిరెడ్డి పార్టీ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చామని, నేడు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అటకెక్కించిందని విమర్శించారు.

 సంక్షేమ పథకాలకు తూట్లు

అనంతపురం నగరంలో రెండున్నరేళ్లుగా ఒక్క కొత్త పింఛన్‌ కూడా ఇవ్వకపోగా, గతంలో ఉన్న పింఛన్ల సంఖ్యను సైతం తగ్గించారని అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. కూటమి పాలనలో దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ప్రజలు భయాందోళనల మధ్య జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో గడపగడపకూ సంక్షేమ పథకాలు అందించామని గుర్తుచేశారు. ఏ. నారాయణపురం పంచాయతీలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించామని, తద్వారా ప్రాంతంలో భూముల విలువలు పెరిగేలా అభివృద్ధి చేశామని తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ, కూటమి ప్రభుత్వాల పాలన మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారని పేర్కొన్నారు.

 పార్టీ బలోపేతమే లక్ష్యం 

వైయ‌స్ఆర్‌సీపీని మరింత బలోపేతం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేసి, నాయకులకు కొత్త బాధ్యతలు అప్పగించినట్లు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. పార్టీ గుర్తింపు కార్డులు కార్యకర్తలకు గుర్తింపుతో పాటు భవిష్యత్తులో గౌరవాన్ని తెచ్చిపెడతాయని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాబోయే కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మదన్‌ మోహన్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, మల్లెల వేణుగోపాల్‌, రామానుజన్‌రెడ్డి, సాకే అశోక్‌కుమార్‌, పుల్లారెడ్డి, రామలింగారెడ్డి, అరుణ్‌కుమార్‌రెడ్డి, లింగారెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, సురేష్‌, లక్ష్మీనారాయణ, బండారు నరేష్‌, కుల్లాయప్ప, వెన్నం శివారెడ్డి, జానీ తదితరులు పాల్గొన్నారు.

Back to Top