స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌లో భారీ కుట్ర

అధికార పార్టీ ఆదేశాల మేరకే ఎస్‌ఈసీ పని చేస్తోంది

టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఫైర్ 

తాడేపల్లి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను హడావుడిగా విడుదల చేయడం వెనుక అధికార కూటమి ప్రభుత్వ భారీ కుట్ర దాగి ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) రాజ్యాంగబద్ధంగా, స్వతంత్రంగా వ్యవహరించకుండా అధికార పార్టీ ఆదేశాలకు తలొగ్గి పని చేస్తున్నట్లు స్పష్టమవుతోందని ఆయన వెల్లడించారు. ఎన్నికల నియమావళి, నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకే తప్ప అధికార కూటమి పార్టీలకు వర్తించవన్న రీతిలో కమిషన్‌ వ్యవహరిస్తోందని ఆక్షేపించారు.
    కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా ఓటర్ల సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌–సర్‌) ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో, కొత్తగా నమోదయ్యే లక్షలాది యువ ఓటర్లకు అవకాశం కల్పించకుండా, ఆ జాబితా రాక ముందే ఎందుకు హడావుడిగా నోటిఫికేషన్‌ ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా ఎన్నికల సంఘం ఇప్పటికైనా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా పని చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన టీజేఆర్‌ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్‌లో టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఇంకా ఏం మాట్లాడారంటే..:

నోటిఫికేషన్‌ వెనుక పెద్ద కుట్ర. ఎస్‌ఈసీకి అగ్నిపరీక్ష:
    రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తీరు చూస్తే దీని వెనుక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పెద్ద కుట్ర దాగి ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. 2018–19 కాలంలో చంద్రబాబుగారు సీఎంగా ఉన్నప్పుడు ప్రస్తుత ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునేత సీఎస్‌గా పని చేశారు. ఇప్పుడు ఆ కృతజ్ఞతా భావంతోనే అధికార పార్టీకి కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నారా? అన్న బలమైన అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో, నిష్పక్షపాతంగా వ్యవహరించి తన పారదర్శకతను నిరూపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ఉంది. కానీ ఎస్‌ఈసీ మాత్రం అనవసర తొందరపాటును, తత్తరపాటును ప్రదర్శిస్తూ రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో కీలుబొమ్మలా మారి విశ్వసనీయతను కోల్పోతోంది.

30 గంటలు ఎందుకు ఆగలేకపోయారు?
13 లక్షల మంది కొత్త ఓటర్లపై దెబ్బ:
    సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అక్టోబరు 16 నాటికి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) వెలువడనుందని తెలిసినా.. కేవలం 30 గంటల సమయం కూడా ఎందుకు వేచి చూడలేకపోయారు? 14వ తేదీ ఉదయం 10 గంటలకు షెడ్యూల్‌ అని చెప్పి, మళ్లీ సాయంత్రం 3:30 గం.కు మార్చాల్సిన అవసరం ఎవరి కోసం వచ్చింది? ఎస్‌ఐఆర్‌ తుది జాబితా వస్తే రాష్ట్రంలో సుమారు 11 నుంచి 13 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు కావడంతో పాటు, చనిపోయిన వారి పేర్లు, డూప్లికేట్‌ ఎంట్రీలు తొలగించబడతాయి. ఇంత కీలకమైన ప్రక్రియ ముగియక ముందే నోటిఫికేషన్‌ ఇవ్వడం ద్వారా ఆ లక్షలాది యువతను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఎందుకు అడ్డుకున్నారు? ఎస్‌ఐఆర్‌ గడువును అక్టోబర్‌ 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఉన్న సమాచారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియదా? మిమ్మల్ని ఎవరు వెనకుండి నడిపిస్తున్నారు? ముఖ్యమంత్రా లేక షాడో ముఖ్యమంత్రా?.

మంగళగిరి, తాడేపల్లిని ఎందుకు మినహాయించారు?:
    తొలుత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్థానాలకు ఎన్నికలు అని ప్రకటించిన కమిషన్, ఆ తర్వాత అకస్మాత్తుగా 5 స్థానాలను మినహాయించింది. అందులో మంత్రి నారా లోకేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉండటం విడ్డూరం కాదా? తొలుత ఇచ్చిన జాబితాలో ఉన్న ఈ రెండు మున్సిపాలిటీలను ఏ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పించారు? అధికార పార్టీ ఓటమి భయంతోనే తన ప్రాబల్యం లేని చోట్ల ఎన్నికలను వాయిదా వేయిస్తోందా? ఇది ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే.

కుల, నో డ్యూస్‌ సర్టిఫికెట్ల పేరిట వేధింపులు.
పారా మిలిటరీ బలగాలు కావాలి:
    గతంలో పులివెందుల, ఒంటిమిట్టలలో టీడీపీ గూండాలు, రౌడీలు బరి తెగించి నామినేషన్లు వేయకుండా అభ్యర్థులపై దాడులు చేసి, పోలీసుల అండతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా అదే రీతిలో గ్రామ సచివాలయాల్లో ప్రతిపక్ష అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు, నో–డ్యూస్‌ పత్రాలు ఇవ్వకుండా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సర్టిఫికెట్‌ లేకపోతే నామినేషన్‌ తిరస్కరిస్తారని తెలిసి అధికారులతో కుమ్మక్కై వేధిస్తున్నారు. 14వ తేదీ నుంచే అధికారులు ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చినా ఇప్పటివరకు దీనిపై ఎలాంటి దిద్దుబాటు చర్యలు లేవు. రాష్ట్ర పోలీసు వ్యవస్థపై మాకు ఏ మాత్రం నమ్మకం లేదు. ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే కేంద్ర పారా మిలిటరీ దళాలను రంగంలోకి దించాలి. రాబోయే 90 రోజుల పాటు ఎన్నికల ప్రక్రియ అంతా సీసీటీవీ కెమెరాల నిఘా నీడలోనే నిర్వహించాలి.

పండుగల వేళ ఎన్నికల చిచ్చా?:
    దసరా శరన్నవరాత్రులు, దీపావళి వంటి మహోన్నత పండుగలు జరుగుతున్న సమయంలో గ్రామాల్లో ఎన్నికల హడావిడి సృష్టించి ప్రజల మధ్య కక్షలు, కార్పణ్యాలు రగల్చడం ఎంతవరకు సమంజసం? అక్టోబర్‌ 13న జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ, జనసేన మినహా మిగిలిన పార్టీలన్నీ పండుగలు ముగిసిన తర్వాత, నవంబర్‌ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. అప్పటికి ఎస్‌ఐఆర్‌ జాబితా కూడా పూర్తయ్యేది. సనాతన ధర్మం, హిందూ పరిరక్షణ అని మాట్లాడే కూటమి పెద్దలకు పవిత్రమైన నవరాత్రుల సమయంలో పల్లెల్లో ఎన్నికల చిచ్చు పెట్టడం ధర్మమేనా?.

ఎన్నికల కోడ్‌ కేవలం వైఎస్సార్‌సీపీకేనా?:
    మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల నియమావళి కేవలం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే వర్తిస్తుందా?. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఇప్పటికీ యథేచ్ఛగా పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు దర్శనమిస్తున్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, పార్టీ చేరికలు జరుగుతున్నా ఎన్నికల సంఘం ఎందుకు పట్టనట్లు వ్యవహరిస్తోంది?.
    2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ పోలింగ్‌ శాతంలో అంతు చిక్కని వ్యత్యాసాలు, ఈవీఎంల బ్యాటరీ రీడింగ్లలో మార్పులు, ఫారం–20 లభ్యతలో జాప్యం వంటి అనేక అనుమానాలపై ఈసీ ఇప్పటికీ నోరు మెదపలేదు. హిందూపురంలో కాంగ్రెస్‌కు వందల ఓట్లు వచ్చి మాకు ఒకే ఒక్క ఓటు రావడం లాంటి విడ్డూరాలపై కూడా ఇంకావివరణ ఇవ్వలేదు. 
    అందుకే ఇప్పటికైనా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యేలోగా ఎస్‌ఈసీ స్పందించి, అధికార పార్టీ ఆదేశాలకు కాకుండా రాజ్యాంగానికి కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని టీజేఆర్‌ సుధాకర్‌బాబు తేల్చి చెప్పారు. 

Back to Top