కళ్యాణదుర్గం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా దొడగట్ట హర్షిని

 హర్షిని గెలుపునకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలి:  మాజీ ఎంపీ త‌లారి రంగ‌య్య‌

క‌ళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా దొడగట్ట హర్షినిని వైయ‌స్ఆర్‌సీపీ ప్రకటించింది. మాజీ ఎంపీ, పీఏసీ సభ్యుడు, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ తలారి రంగయ్య ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఎంఎస్సీ అగ్రికల్చర్‌ విద్యను అభ్యసించిన హర్షిని, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ దొడగట్ట నారాయణ కుమార్తె. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు ఉమామహేశ్వర నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ తిప్పేస్వామి మాట్లాడుతూ, హర్షినితో పాటు మున్సిపల్‌ కౌన్సిలర్‌ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా అందించాలని కోరారు. యువత, విద్యావంతురాలైన హర్షిని అభ్యర్థిత్వంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు కోరారు. 

Back to Top