తాడేపల్లి: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల దృష్ట్యా ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులో ఉన్నా, ఎక్కడా అధికార టీడీపీ దాన్ని పాటించడం లేదని.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సహా, ఆ పార్టీ నాయకుల చిత్రాలతో కూడిన ఫ్లెక్సీ బ్యానర్లు, హోర్డింగ్లు, కటౌట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)కు లేఖ రాసిన వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వాటిపై తక్షణం చర్య తీసుకోవాలని, అన్నీ తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ అధికారులు ఈ ప్రచార ప్రదర్శనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందు తమ పార్టీ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి, తమ రాజకీయ పలుకుబడిని ప్రదర్శించడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇటువంటి ప్రచార సామగ్రిని ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వర్తించే ఆంక్షలను వారు పట్టించుకోవడం లేదన్నారు. సంబంధిత అధికారులు కూడా ఈ ప్రచార ప్రదర్శనలపై చర్యలు తీసుకోవడంలో విఫలమవడంతో, ఎన్నికల నియామావళిని నిష్పక్షపాతంగా అమలు చేయడంపై అనుమానాలు తలెత్తుతున్నాయని వెల్లడించారు. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ప్రచార సామగ్రిని ఎటువంటి అడ్డంకులు లేకుండా కొనసాగించడానికి అనుమతించడం, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికలకు అవసరమైన సమాన అవకాశాల స్థాయిని దెబ్బ తీస్తుందని ఆ లేఖలో లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. కాబట్టి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ టీడీపీ ప్రదర్శిస్తున్న ప్రచార సామగ్రిని గుర్తించి వెంటనే తొలగించాలని, కొత్తగా అనధికారికంగా ఏర్పాటు చేసే వాటిని పూర్తిగా నిరోధించాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించాలని ఆయన ఎన్నికల కమిషనర్ను కోరారు. అలాగే, ప్రతి జిల్లాలో తీసుకున్న చర్యలకు సంబంధించి నిర్ణీత గడువులోగా ఫాలో అప్ నివేదికలను సమర్పించేలా ఆదేశించాలని, ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యే అధికారుల బాధ్యతను నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా, ఎన్నికల ప్రవర్తనా నియామవళి రాష్ట్రవ్యాప్తంగా ఎటువంటి జాప్యం లేకుండా, సమానంగా, నిష్పక్షపాతంగా అమలయ్యేలా ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకోవాలన్న లేళ్ల అప్పిరెడ్డి, ఆ లేఖ ప్రతిని కేంద్ర ఎన్నికల కమిష¯Œ కు కూడా పంపారు.