తాడేపల్లి: మైనారిటీలు, బీసీలకు నాణ్యమైన విద్యావకాశాలు దక్కాలంటే మళ్లీ జగన్‌గారు సీఎం కావాలని, కలాం గారి స్ఫూర్తితోనే పేదవర్గాల కలల సాకారం కోసం నాడు జగన్‌గారు పని చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. భారతదేశం గర్వించదగ్గ మిసైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం జయంతిని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయ ఇంచార్జ్, ఎమ్మెల్సీ శ్రీ లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు అబ్ధుల్ కలామ్ గారిని స్మరిస్తూ, దేశానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. మారుమూల ప్రాంతంలో, సాధారణ ముస్లిం పేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం... తన పట్టుదల, కృషితో దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అధిరోహించడమే కాక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలిపిన మహానుభావుడని కొనియాడారు. విద్యను బలమైన ఆయుధంగా మలచుకోవాలని, కలలు కనే వాటిని సాకారం చేసుకోవాలని ఆయన యువతకు అందించిన స్ఫూర్తిదాయక సందేశాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వైయస్ఆర్సీపీ హయాంలోనే కలాం ఆశయాల అమలు: అబ్దుల్ కలాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలను ఆచరించి, అమలు చేసిన ఘనత ఒక్క వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్. జగన్ గారికి మాత్రమే దక్కుతుందని వక్తలు స్పష్టం చేశారు. గత ఐదేళ్ల వైయస్ఆర్సీపీ పాలనలో పేదరికం చదువుకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ‘నాడు – నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చి కార్పొరేట్ సంస్థలకు దీటుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, మైనారిటీలకు, బడుగు బలహీన వర్గాలకు అడుగడుగునా అన్యాయం చేస్తూ విధ్వంసకర పాలన సాగిస్తోందని నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కులాల, మతాల మధ్య చిచ్చుపెడుతూ, రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తూ ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అబ్దుల్ కలాం ఆశయాలు నెరవేరాలన్నా, పేద, బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రంలో మళ్లీ జగన్ గారు సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తేల్చి చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పేద ప్రజలందరూ ఏకమై వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారానే అబ్దుల్ కలాం గారికి నిజమైన నివాళులు అర్పించినట్లవుతుందని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ నూర్భాషా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ దస్తగిరి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి షరీఫ్‌తో పాటు, పార్టీ నాయకులు ఎండీ ఫిరోజ్, షేక్ అయూబ్, శ్రీనివాస్, కల్యాణి.. ఇంకా పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.