సామాన్య కార్యకర్తకు కడప మేయర్‌ అభ్యర్థిగా అవకాశం

వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన బండి దీప్తిరెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న తనకు కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బండి దీప్తిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కడప మేయర్‌గా తనను ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను కోరారు.

తన అభ్యర్థిత్వానికి సహకరించిన వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, మాజీ జెడ్పీ చైర్మన్‌ కె. సురేష్‌బాబులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మేయర్‌గా అవకాశం కల్పిస్తే ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తానని, నగరంలో పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజల మన్ననలు పొందేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కడప మేయర్‌ అభ్యర్థిగా బండి దీప్తిరెడ్డి, పులివెందుల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా వైయస్‌ ప్రమీలమ్మ, ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహారెడ్డి, కమలాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా మారుజోళ్ల కవితను ఎంపిక చేసినట్లు పార్టీ జిల్లా అధ్య‌క్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. ఎన్నికల హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు చెప్పాలని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.  జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, మాజీ జెడ్పీ చైర్మన్‌ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Back to Top