ఉరవకొండ: ఉరవకొండలోని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి గ్రామ, మండల ఇన్చార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉరవకొండ పట్టణం, ఉరవకొండ రూరల్, విడపనకల్, వజ్రకరూరు, కూడేరు, బెలుగుప్ప మండలాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ, సమష్టిగా పనిచేయాల్సిన అవసరాన్ని వై. విశ్వేశ్వరరెడ్డి వివరించారు. సమావేశాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు వైయస్ఆర్సీపీ ఉరవకొండ కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.