తాడేపల్లి: అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ని పూర్తిగా నిర్మూలిస్తామని ఎన్నికల సమయంలో ఊకదంపుడు ప్రసంగాలు చేసిన కూటమి నేతలు, నేడు రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నా ఎందుకు అడ్డుకోలేకపోతోందని నిలదీశారు. వంద రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తామన్న హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, విజయవాడలో ఎండీఎంఏ పట్టుబడటం, అనకాపల్లి జిల్లాలో భారీ పరిమాణంలో హాష్ ఆయిల్ స్వాధీనం కావడం, ప్రకాశం జిల్లాలో పోలీసు వాహనంలో గంజాయి దొరకడం వంటి ఘటనలు రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని పేర్కొన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు, యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న గంజాయి, డ్రగ్స్ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ప్రశ్నించారు. గంజాయి, డ్రగ్స్ అనే మాటే వినిపించకుండా నిర్మూలిస్తామని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు, లోకేష్, హోంమంత్రి అనిత ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని రేగిడి లక్ష్మణరావు నిలదీశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 100 రోజుల్లో నిర్మూలిస్తామన్నారుగా: ఎన్నికల ముందు చంద్రబాబు, నారా లోకేష్, హోంమంత్రి అనిత రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఘటనలు ఎందుకు వెలుగులోకి వస్తున్నాయి? విజయవాడలోనే 110 గ్రాముల ఎండీఎంఏతో ఒక యువతి పట్టుబడిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనకాపల్లి జిల్లాలో రూ.5.5 కోట్ల విలువైన 43 లీటర్ల హాష్ ఆయిల్ పట్టుబడింది. మరి చంద్రబాబు ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ ఏం చేస్తోంది? ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ చైతన్యం, వజ్ర ప్రహార్ వంటి కార్యక్రమాల పేర్లు చెప్పడం కాదు.. వాటి ఫలితాలు ఏమిటో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గంజాయి, ఎండీఎంఏ, హాష్ ఆయిల్, లిక్విడ్ గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతే దాని ప్రభావం యువత భవిష్యత్తుపై పడుతుంది. మహిళల భద్రత, ప్రజల రక్షణ విషయంలో కూడా ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రచారానికే పరిమితమైతే ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? పరారీలో ఉన్న 712 మంది నిందితుల సంగతేంటి? : 2026 ఫిబ్రవరిలో జరిగిన అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశానికి సంబంధించిన వివరాల్లో 712 మంది నిందితులు పరారీలో ఉన్నారని, 125 నాన్ బెయిలబుల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసుల్లో పురోగతి ఏమిటో, పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు తీసుకున్న చర్యలేమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలి. గంజాయి సాగును ధ్వంసం చేశామని, అక్రమ రవాణాను అడ్డుకున్నామని గణాంకాలు ప్రకటించడం ఒక్కటే సరిపోదు. అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన నెట్‌వర్క్‌లను ఛేదించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడే ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపితమవుతుంది. జగన్ గారి హయాంలో ఆపరేషన్ పరివర్తన.. ఇప్పుడు ఆ చర్యలేవి?: వైఎస్ జగన్ గారి ప్రభుత్వ హయాంలో గంజాయి నియంత్రణకు ఆపరేషన్ పరివర్తన చేపట్టి, ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును అరికట్టడంతో పాటు గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. గంజాయి సాగు వెనుక ఉన్న ఆర్థిక పరిస్థితులను గుర్తించి, గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడంపై దృష్టి పెట్టాం. 11,550 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశాం. 13,210 మందిని అరెస్టు చేశాం. 2,950 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎస్‌ఈబీ ద్వారా 14500 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచి గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టాం. మరి ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి, డ్రగ్స్ నియంత్రణలో సాధించిన ఫలితాలేమిటి? రాష్ట్రవ్యాప్తంగా అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను అడ్డుకోవడంలో ఎంతవరకు విజయం సాధించింది? ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు.. డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు: 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ ను నిర్మిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. కానీ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టలేకపోతే ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ హామీకి అర్థమేంటి? 100 రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తామని ఎన్నికల్లో ప్రచారం చేసుకున్న కూటమి ప్రభుత్వం, ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ సమస్యను ఎందుకు నియంత్రించలేకపోతోందో సమాధానం చెప్పాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పి, యువత భవిష్యత్తుకు ముప్పుగా మారుతున్న మాదకద్రవ్యాల సమస్యపై నిర్లక్ష్యం వహించడం తగదు. ఎన్నికల హామీలను మాటల్లో కాకుండా చేతల్లో నిరూపించాలని, యువతను మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడాలని కోరారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర వివరాలు వెల్లడించాలని రేగిడి లక్ష్మణరావు డిమాండ్ చేశారు.