కుప్పంలో టీడీపీ దౌర్జన్యం.. వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్ అభ్యర్థి కిడ్నాప్‌!

ఎమ్మెల్సీ భరత్ ఇంటిపై దాడి.. ప్యాలెస్ రోడ్డులో ఉద్రిక్తత\

11, 20వ వార్డు అభ్యర్థులపై దాడి.. తలకు తీవ్ర గాయాలు\

మున్సిపల్ కార్యాలయం వద్ద 3 వేల మందికి పైగా టీడీపీ శ్రేణుల మోహరింపు

చిత్తూరు జిల్లా : కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్ అభ్యర్థి విజయ్ కుమార్‌ను టీడీపీ శ్రేణులు కారులో కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. డీకేపల్లి నివాసం నుంచి వస్తున్న సమయంలో ఆయనను అడ్డుకుని తీసుకెళ్లినట్లు సమాచారం. తన భర్తకు ప్రాణహాని ఉందంటూ విజయ్ కుమార్ భార్య పావని కన్నీటి పర్యంతమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఎమ్మెల్సీ భరత్ ఇంటిపై దాడి

కుప్పం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ భరత్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని ఆరోపణలు వచ్చాయి. ప్యాలెస్ రోడ్డులోని ఆయన నివాసాన్ని చుట్టుముట్టినట్లు సమాచారం. మున్సిపల్ కార్యాలయంలోకి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు ప్రవేశించకుండా 3 వేల మందికి పైగా టీడీపీ శ్రేణులు మోహరించాయని పార్టీ వర్గాలు ఆరోపించాయి.

11, 20వ వార్డు అభ్యర్థులపై దాడి

కుప్పం మున్సిపాలిటీలో 11వ వార్డు అభ్యర్థి జయశంకర్, 20వ వార్డు అభ్యర్థి జయంత్‌పై దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో వారి తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అభ్యర్థులకు రక్షణ కల్పించాలి

చైర్మన్ అభ్యర్థి కిడ్నాప్‌, ఎమ్మెల్సీ భరత్ నివాసంపై దాడి, వార్డు అభ్యర్థులపై దాడి ఘటనలతో కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కిడ్నాప్‌ ఆరోపణలపై తక్షణమే స్పందించి విజయ్ కుమార్ ఆచూకీ వెల్లడించాలని, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు రక్షణ కల్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కోరుతున్నాయి.
 

Back to Top