పింఛన్ల పంపిణీలో టీడీపీ కార్యకర్తలు ఓటర్లను ప్రభావితం చేయకుండా చూడాలి

మదనపల్లెలో మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి

తుఫాన్‌ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాల తయారీ షెడ్యూల్‌ సవరించాలి

మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో పక్షపాతం చూపిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల్లో సీసీటీవీ నిఘా, వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేయాలి

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ను కోరిన వైయస్సార్‌సీపీ

తాడేపల్లి: రాష్ట్రంలో నవంబరు 1న జరిగే పింఛన్ల పంపిణీ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఓటర్లను ప్రభావితం చేయకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)కి వైయస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది. అలాగే అర్నబ్‌ తుపాన్‌ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాల తయారీకి ఇచ్చిన షెడ్యూల్‌ ను సవరించాలని పార్టీ కోరింది. దీంతో పాటు మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ అభ్యర్ధులను వేధించిన అధికారులపై దర్యాప్తు చేయించి, తగు చర్యలు తీసుకోవాలని కోరింది. ఇంకా మదనపల్లెలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నాలుగు వేర్వేరు లేఖలు ఎస్‌ఈసీకి పంపారు. 
ఆయా లేఖల్లో వైయస్సార్‌సీపీ ఏయే అంశాలు ప్రస్తావించిందంటే..:

పింఛన్ల పంపిణీని  టీడీపీ ప్రభావితం చేయకుండా చూడాలి:
    రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్‌ 30న జరుగుతున్న పింఛన్ల పంపిణీలో  టీడీపీ కార్యకర్తలు ఓటర్లను ప్రభావితం చేయకుండా నిరోధించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కు  అత్యవసర విజ్ఞప్తి చేసింది.  ప్రభుత్వం సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేసే సామాజిక భద్రతా పింఛన్లను, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే అక్టోబర్‌ 30న ఇస్తున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించింది. 
    రేపు జరిగే పింఛన్ల పంపిణీ సందర్భంగా టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి వెళ్లి లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి, అధికార పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందని తమకు తీవ్రమైన ఆందోళన ఉందని, ప్రజాసంక్షేమ పథకం కింద అందించే పింఛన్ల పంపిణీని ఎన్నికల ప్రచారానికి లేదా ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఉపయోగించే ప్రమాదం ఉందని భావిస్తున్నట్లు తెలిపింది.  అందువల్ల పింఛన్ల పంపిణీ సమయంలో టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఇతర రాజకీయ ప్రతినిధులు ప్రభుత్వ సిబ్బందితో కలిసి వెళ్లకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కఠినమైన ఆదేశాలు జారీ చేయాలని కోరింది.  ఈ కార్యక్రమాన్ని కేవలం అధీకత ప్రభుత్వ ఉద్యోగులే నిర్వహించేలా చూడాలని, రాజకీయ జోక్యాన్ని నిరోధించేందుకు జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా వ్యవహరించే రాజకీయ కార్యకర్తలు, వారికి సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేసింది.  

మదనపల్లెలో పోలింగ్‌ రోజు అక్రమాలను అడ్డుకోవాలి:
    నవంబరు 1న జరిగే మున్సిపల్‌ ఎన్నికల సమయంలో అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు, ఓటర్లు బెదిరింపులు లేదా అడ్డంకులను ఎదుర్కొనే అవకాశం ఉందని మదనపల్లె మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి జింకా వెంకట చలపతి లేవనెత్తిన ఆందోళనలను పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దష్టికి తెచ్చింది. మదనపల్లెలో జరిగే ఎన్నికల ముందు కొంతమంది వ్యక్తులను సమీకరించినట్లు తమకు సమాచారం అందిందని అభ్యర్థి పేర్కొన్నట్లు లేఖలో తెలిపింది.  దీనివల్ల అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లను బెదిరించడం, పోలింగ్‌ కేంద్రాల వద్ద అంతరాయాలు సష్టించడం, ఓటు హక్కు వినియోగానికి ఆటంకం కలిగించడం వంటి పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 
    ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుని, సంబంధిత అధికారులకు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని కోరింది.  ఎన్నికల సమయంలో, ముఖ్యంగా పోలింగ్‌ రోజున, మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని, ఆయన అనుచరుల జోక్యాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు గతేడాది ఆగస్టు 12న ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి వైఎస్సార్సీపీ పోలింగ్‌ ఏజెంట్‌ పై చేసిన దాడికి సంబంధించిన వీడియోలు, మీడియా కథనాలను కూడా ఈ లేఖతో పాటు పంపింది. ఈ ఘటనపైనా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ కోరింది. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితా సవరణకు రీషెడ్యూల్‌:
    మరోవైపు తుపాను కారణంగా ఏర్పడిన అంతరాయాలు, ఓటర్ల వివరాల ధ్రువీకరణకు తగిన సమయం లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాల తయారీ షెడ్యూల్‌ను సవరించాలని వైఎస్సార్సీపీ కోరింది. ఈ సందర్భంగా  కాకినాడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు శంకర శివ ప్రసన్న సాగర్‌ లేవనెత్తిన ఆందోళనలను పార్టీ ఎన్నికల కమిషన్‌ దృష్టికి తెచ్చింది. 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు, జాబితాల తయారీ, ప్రచురణకు సంబంధించి అక్టోబరు 23న జారీ చేసిన జీఓ ఆర్టీ నెం:1298 లోని షెడ్యూల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 
    ఇంత తక్కువ సమయంలో సర్వే పూర్తి చేయడం వల్ల ఓటర్ల వివరాల సేకరణ, ధ్రువీకరణ, తప్పుల సవరణ ప్రక్రియల నాణ్యతపై ఆందోళనలు ఉన్నాయని పేర్కొంది.  శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి వంటి అధిక జనాభా కలిగిన మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఇంటింటి సర్వే పూర్తి చేయడానికి, రికార్డులను పరిశీలించడానికి, తప్పులను సరిదిద్దడానికి తగిన సమయం అవసరమని తెలిపింది. 
    అక్టోబర్‌ 25 నుంచి 28 మధ్య తుపాను పరిస్థితులు ఏర్పడటంతో సర్వే, ముసాయిదా జాబితాల ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియలకు అంతరాయం కలిగిందని గుర్తుచేసింది. దీంతో సిబ్బంది సర్వేను పూర్తి చేయలేకపోయారని, ఓటర్లు ముసాయిదా జాబితాలను పరిశీలించి తప్పులు గుర్తించడం, అభ్యంతరాలు సమర్పించడం కూడా కష్టమైందని తెలిపింది.  అభ్యంతరాల స్వీకరణకు ఒక్కరోజు మాత్రమే ఇచ్చి, వెంటనే తుది జాబితాలను ప్రచురించడం వల్ల ప్రజలకు తగిన పరిశీలన అవకాశం లభించదని పేర్కొంది.  సర్వే పూర్తికాకుండానే తుది జాబితాలు ప్రకటిస్తే అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తొలగించబడే లేదా తప్పుగా వర్గీకరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాబట్టి ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కొత్త షెడ్యూల్‌ ప్రకటించాలని కోరింది.  

పక్షపాతం చూపిన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలి:
    మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పోలీసు అధికారుల పక్షపాత వైఖరి, జోక్యం, నామినేషన్ల దాఖలుకు అడ్డంకులు, బలవంతపు ఉపసంహరణలపై వచ్చిన తీవ్రమైన ఫిర్యాదులను వైయస్సార్‌సీపీ కమిషన్‌ దృష్టికి తెచ్చింది. గతంలో సమర్పించిన ఫిర్యాదుల్లో పేర్కొన్న ఆరోపణలతో పాటు, తాజాగా వెలుగులోకి వచ్చిన మరికొన్ని పేర్లు, ఘటనలను కూడా కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చింది. ఈ ఆరోపణలు ఎన్నికల మిగిలిన దశల నిష్పక్షపాత నిర్వహణపై ఆందోళన కలిగిస్తున్నందున తక్షణ జోక్యం అవసరమని భావిస్తున్నట్లు తెలిపింది.
    పోలీసు అధికారులు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన సమయంలో, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని, బెదిరింపులకు పాల్పడ్డారని, నామినేషన్లను ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో ఆరోపించింది.  కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై బైండోవర్‌ కేసులు నమోదు చేయడం, తప్పుడు కేసులు పెడతామని బెదిరించడం, దాడులు జరిగినప్పుడు రక్షణ కల్పించకపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఈ ఆరోపణలను పరిశీలించి, సంబంధిత అధికారుల పాత్రపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరింది. 
    ఇందులో నియోజకవర్గాల వారీగా చూస్తే కర్నూలు రేంజ్‌ లో కర్నూలు డీఐజీ కె. ప్రవీణ్, పులివెందులలో  అదనపు ఎస్పీ ప్రకాశ్‌ బాబు, రాజంపేటలో సీఐ హేమసుందర్‌ రావు, బద్వేల్, చిత్తూరు, గుంటూరు, గుడివాడ, మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలుకు అడ్డంకులు, బెదిరింపులు, దాడులు, నామినేషన్‌ పత్రాలను చించివేయడం, అభ్యర్థులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం వంటి ఆరోపణల్ని ప్రస్తావించింది. అలాగే  ప్రకాశం జిల్లాలోని కొండేపి, మార్కాపురం జిల్లాలోని యర్రగొండపాలెం, శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి తదితర నియోజకవర్గాల్లో పోలీసు అధికారులు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్నారని ఫిర్యాదులో తెలిపింది. కాబట్టి ఆయా అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. 

హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలకు సీసీటీవీల భద్రత, వెబ్‌ కాస్టింగ్‌:
    అలాగే మున్సిపల్‌ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించే విషయంలో హైకోర్టు ఆదేశాల అమలుపై వైఎస్సార్‌సీపీ మరో వినతిపత్రం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కు పంపింది. ఇందులో గతంలో పంపిన మూడు వినతిపత్రాలు, హైకోర్టు అక్టోబర్‌ 16న ఇచ్చిన ఉత్తర్వుల ప్రతుల్ని జత చేసింది. ఇందులో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియలో హింస, బెదిరింపులు, అడ్డంకులు ఎదురవుతున్నాయని పార్టీ గతంలోనే కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చిందని వైఎస్సార్సీపీ మరో  లేఖలో ప్రస్తావించింది. పుంగనూరు, పులివెందుల, కడప, కమలాపురం, తిరుపతి, రాయచోటి, రాజంపేట, నెల్లూరు, నంద్యాల, ఆదోని, చెమ్మకుర్తి, ధర్మవరం, దాచేపల్లి, జమ్మలమడుగు, దర్సి, గురజాల తదితర ప్రాంతాల్లో నామినేషన్‌ పత్రాలను లాక్కోవడం, చించివేయడం, అభ్యర్థులు, ప్రతిపాదకులపై దాడులు, బెదిరింపులు, పోలీసుల మౌనం వంటి ఘటనలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని గుర్తుచేసింది. హైకోర్టు ఆదేశాల అమలులో భాగంగా సున్నితమైన, అత్యంత సున్నితమైన ప్రాంతాలను గుర్తించి, ప్రాంతాలవారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర పోలీసు శాఖ తెలిపినట్లు ఉత్తర్వుల్లో ఉందని తెలిపింది.
    కాగా, ఇప్పటివరకు తమ వినతిపత్రాలపై తీసుకున్న చర్యలు లేదా హైకోర్టు ఆదేశాల అమలుకు సంబంధించిన వివరాలు కమిషన్‌ నుంచి అందలేదని వినతిపత్రంలో పేర్కొంది. ఈ వివరాలు లేకపోవడం వల్ల పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందనే నమ్మకం అభ్యర్థులకు, ఓటర్లకు కలగడం లేదని తెలిపింది. ముఖ్యంగా అధికార పార్టీ ఇతర ప్రాంతాల నుంచి తన కార్యకర్తలను, సంఘవ్యతిరేక శక్తులను మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోకి తీసుకువస్తున్నట్లు తమకు సమాచారం అందిందని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. 
    పోలింగ్‌కు ముందు, పోలింగ్‌ రోజున ఇలాంటి వ్యక్తులు వార్డులు, డివిజన్లలో తిరుగుతూ ఓటర్లను భయపెట్టడం, పోలింగ్‌ కేంద్రాలకు మద్దతుదారులు చేరకుండా అడ్డుకోవడం, పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించడం, నకిలీ ఓటింగ్‌కు పాల్పడడం, ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. నామినేషన్ల దశలోనే హింస, బెదిరింపులు చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో పోలింగ్, ఓట్ల లెక్కింపు దశల్లోనూ ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, ప్రత్యక్ష వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేయడం అత్యంత ప్రభావవంతమైన భద్రతా చర్య అని వినతిపత్రంలో పేర్కొంది. దీని ద్వారా ఎన్నికల కమిషన్‌ తక్షణమే పరిస్థితులను పర్యవేక్షించగలదని, ఫిర్యాదులపై స్పందించేందుకు ఆధారాలు లభిస్తాయని తెలిపింది. బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచినప్పటి నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు స్ట్రాంగ్‌ రూమ్‌లకు రౌండ్‌ది–క్లాక్‌ నిఘా, సాయుధ భద్రత అవసరమని పేర్కొంది. ఈ దిశగా ఎన్నికల కమిషన్‌ తీసుకోవాల్సిన చర్యల్ని వైఎస్సార్సీపీ ఈ లేఖలో గుర్తు చేసింది.
    పోలింగ్‌కు ముందే ఈ చర్యలు అమలు చేసి, తీసుకున్న చర్యల వివరాలను తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది. తద్వారా లోపాలు ఉంటే గుర్తించి, చట్టపరమైన పరిష్కారాలు కోరేందుకు వీలుంటుందని వైయస్సార్‌సీపీ పేర్కొంది.

Back to Top