అర్నబ్‌ తుపాన్‌తో పశ్చిమ గోదావరి జిల్లా అతలాకుతలం

లక్షలాది కొబ్బరి చెట్లు నేలకొరిగాయి

70 వేల హెక్టార్లలో వరి పంటకు నష్టం

ఈ నష్టానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

ముదునూరి ప్రసాదరాజు ధ్వజం

నరసాపురంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు. 
 
ఆర్నబ్‌ తుపానుతో జిల్లాలో ఆక్వా రంగానికీ తీవ్ర నష్టం

విద్యుత్‌ లేక ఆక్సిజన్‌ సమస్యతో ఆక్వా రైతులకు నానా అగచాట్లు

పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పరిహారం అందించాలి

పునరావాస కేంద్రాల్లో బాధితులకు బియ్యం, పప్పులు, పాలు, నిత్యావసరాలు తక్షణమే పంపిణీ చేయాలి

దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం అందించి బాధితులను ఆదుకోవాలి

ప్రెస్‌మీట్‌లో ముదునూరి ప్రసాదరాజు డిమాండ్‌

నరసాపురం:     ఆర్నబ్‌ తుపాను నష్టానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వైయస్‌ఆర్‌సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. తుపాను ప్రభావంతో జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా వరి, అరటి, కొబ్బరి పంటలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. తుపాను ప్రభావం తగ్గినా విద్యుత్‌ సరఫరా, రహదారుల పునరుద్ధరణలో జాప్యం కొనసాగుతోందని, బాధితులకు తక్షణ సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.
    పంట నష్టాన్ని వేగంగా అంచనా వేసి రైతులకు పరిహారం అందించడంతో పాటు, తుపాను బాధితులకు పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని నరసాపురంలో మీడియాతో మాట్లాడిన ప్రసాదరాజు కోరారు.
ప్రెస్‌మీట్‌లో ముదునూరి ప్రసాదరాజు ఇంకా ఏం మాట్లాడారంటే..:

పంటలు, ఆక్వా రంగానికి భారీ నష్టం:
    ఆర్నబ్‌ తుపానుతో పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆక్వా సాగు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 70 వేల హెక్టార్లలో వరి పంట నష్టపోగా, అరటి, కొబ్బరి పంటలు సుమారు 12 వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. లక్షలాది కొబ్బరి చెట్లు నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గోదావరి జిల్లాల్లో ప్రధానమైన ఆక్వా సాగు కూడా విద్యుత్‌ అంతరాయంతో సంక్షోభంలో పడింది. చెరువుల్లో ఆక్సిజన్‌ సమస్య ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

విద్యుత్, పునరావాస సదుపాయాలు వెంటనే కల్పించాలి:
    తుపాను ప్రభావం తగ్గినా పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణలో జాప్యం కొనసాగుతోంది. రహదారులపై చెట్లు పడిపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ పునరుద్ధరణ కోసం అదనపు సిబ్బందిని నియమించి పనులను వేగవంతం చేయాలి. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు బియ్యం, పప్పులు, పాలు, ఇతర నిత్యావసర సరుకులను వెంటనే పంపిణీ చేయాలి. పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లను గుర్తించి బాధితులకు తక్షణ సహాయం అందించాలి. ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి జాప్యం చేయకూడదు.

పంటల బీమా, నష్టపరిహారం అందించాలి:
    వైయస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి అండగా నిలిచింది. ప్రస్తుత ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందని పరిస్థితి ఏర్పడింది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వరి, ఉద్యాన పంటలు, కొబ్బరి తోటలు, దెబ్బతిన్న ఇళ్ల నష్టాన్ని వేగంగా అంచనా వేయాలి. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు తగిన నష్టపరిహారం అందించాలి. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో బాధితులకు కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి:
    పశ్చిమ గోదావరి జిల్లాలోని 20 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండు మున్సిపాలిటీల్లోనూ పార్టీ పోటీ చేస్తోంది. నరసాపురం నియోజకవర్గంలోని నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 41 ఎంపీటీసీ స్థానాలకు, రెండు జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపాం.
    నిత్యావసరాల ధరల పెరుగుదల, అమలు కాని హామీలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్రజలు ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకుని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ముదునూరి ప్రసాదరాజు విజ్ఞప్తి చేశారు.

Back to Top