పులివెందులలో ఎన్నికల విధ్వంసానికి కుట్ర

పోలింగ్‌కు పటిష్ట భద్రత కల్పించాలి

 బయటి వ్యక్తులతో అల్లర్లు, దొంగ ఓట్లు, రిగ్గింగ్‌కు ప్రణాళిక

ఎస్‌ఈసీ తక్షణ చర్యలు తీసుకోవాలి: పుత్తా శివశంకర్‌

తాడేపల్లి: పులివెందులలో పోలింగ్‌ రోజున భారీ విధ్వంసానికి కుట్ర జరుగుతోందని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి టీడీపీకి చెందిన గూండాలను పులివెందులకు రప్పించి అల్లర్లు సృష్టించేందుకు, దొంగ ఓట్లు, ఓట్ల రీసైక్లింగ్‌, రిగ్గింగ్‌ ద్వారా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని పేర్కొన్నారు. పోలింగ్‌ రోజున పోలీసుల సంఖ్య తగ్గించడం వెనుక కుట్ర ఉందని, అల్లర్లను అదుపు చేయలేకపోయామనే సాకు చూపి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, పోలింగ్‌ ఏజెంట్లను అరెస్టు చేసి ప్రతిపక్షాన్ని నిర్బంధించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కమలాపురం, రాయచోటి, అనంతపురం ప్రాంతాల నుంచి బయటి వ్యక్తులను రప్పించి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద అరాచకాలు సృష్టించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని విమర్శించారు.

పోలింగ్‌కు ముందురోజు నుంచే పులివెందులలో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ ప్రారంభించి, పోలింగ్‌ కేంద్రాల లోపల, బయట నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని పుత్తా శివశంకర్‌ డిమాండ్‌ చేశారు. వెబ్‌కాస్టింగ్‌ దృశ్యాలను పూర్తిస్థాయిలో భద్రపరచాలని, టీడీపీ నాయకుల ఇళ్లు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించి బయటి వ్యక్తులను వెంటనే పంపించాలని కోరారు. పోలింగ్‌ రోజున అదనపు పోలీసు భద్రత కల్పించి, గత జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చంద్రబాబు కుట్రలను అడ్డుకుంటారా, వాటిలో భాగస్వాములవుతారా అన్నది రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చుకోవాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలని, పులివెందుల ప్రజలు భయపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Back to Top