ప‌బ్లిసిటీ త‌ప్ప ప్ర‌జా ప్ర‌యోజ‌నం శూన్యం

బాధిత రైతుల‌ను గాలికొదిలేసి చంద్ర‌బాబు ప‌బ్లిసిటీ

 మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ఫైర్‌

కాకినాడ‌ లోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్‌, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు 

 పంట న‌ష్టం రైతులే అప్‌లోడ్ చేయాలా? అధికారులు ఏం చేస్తున్నారు? 

 కంప్యూట‌ర్ల ముందు కూర్చుని పంట న‌ష్టం అంచ‌నాల పేరుతో ప‌బ్లిసిటీ

 ముందే తుపాన్ హెచ్చ‌రిక‌లున్నా మంత్రుల‌ను ఎందుకు పంప‌లేదు? 

 తుపాన్ న‌ష్ట‌ప‌రిహారం ఎప్ప‌టిలోపు చెల్లిస్తారో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించాలి

 స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌ ప్రకారం వరి రైతులకు కూడా పరిహారం పెంచాలి

  మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు డిమాండ్‌

 కాకినాడ‌: తుపాన్ ప్ర‌భావంతో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తమైతే సీఎం చంద్ర‌బాబు ప్రజలను, రైతులను గాలికొదిలేసి.. కేవలం ప్రచార ఆర్భాటాలతో కంప్యూట‌ర్ల ముందు కూర్చుని టైంపాస్ చేస్తున్నాడ‌ని మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కాకినాడ‌లోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బాధితుల పరిస్థితిని తెలుసుకుని వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఫొటోలు, వీడియోలు, సమీక్షల పేరుతో ప్రచారం చేసుకుంటోందని మండిప‌డ్డారు. తుపాన్ హెచ్చరిక‌లు ముందుగానే ఉన్నా క‌నీసం తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాలకు మంత్రుల‌ను ఎందుకు పంపించ‌లేద‌ని నిల‌దీశారు. రైతులు తమ పంట నష్టం ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేసుకోవాలని చెబుతున్నారనీ, ఎంతమంది రైతులకు ఆ యాప్‌ను ఉపయోగించే అవగాహన ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. రైతుల దగ్గరకు వెళ్లి నష్టాన్ని అంచనా వేయాల్సిన వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఏం చేస్తున్నారో చెప్పాల‌న్నారు. ప్ర‌జలు కన్నీళ్లు పెడుతుంటే చంద్రబాబుకు రాజకీయాలు, ఎన్నికలే ముఖ్యమయ్యాయని, వైఎస్‌ జగన్ గారి ప్రభుత్వంలో రైతులకు కల్పించిన భరోసాను దెబ్బతీసి, ఇప్పుడు వారిని బీమా లేకుండా, ఇన్‌పుట్‌ సబ్సిడీ లేకుండా వదిలేయడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమ‌ని స్ప‌ష్టం చేశారు. విజయవాడ ముంపు సమయంలో సహాయక చర్యల పేరుతో రూ. 500 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి, అందులో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకే రూ. 23 కోట్లు ఖర్చు చేశామని లెక్కలు చూపిన ఘనత ఈ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. అలాగే ఇప్పుడు అర్నబ్ తుపాన్ విపత్తును సైతం బాధితులకు న్యాయం చేయడానికి కాకుండా పబ్లిసిటీకి వాడుకుంటున్నారని కురసాల క‌న్న‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.   

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

- రైతులకు యాప్‌ల‌పై అవ‌గాహ‌న ఉంటుందా? : 

అర్న‌బ్ తుపాను బాధితులకు తక్షణ సహాయం అందించడంలో, పంట నష్టాన్ని అంచనా వేయడంలో, పరిహారం చెల్లించడంలో మీ ప్రభుత్వం విఫలమైంది. తుపాన్లు వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు ప్రజలను, రైతులను గాలికొదిలేసి కేవలం ప్రచార ఆర్భాటాలతో కాలం వెళ్లదీస్తున్నారు. రైతులు పంట నష్టం ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలంటున్నారు, అసలు ఎంతమంది రైతులకు ఆ యాప్‌పై అవగాహన ఉంది? క్షేత్రస్థాయికి వెళ్లి నష్టాన్ని అంచనా వేయాల్సిన వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఏం చేస్తున్నారు? విజయవాడలో బుడమేరు వరదల సమయంలో ప్రజలు పడవల్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సహాయక చర్యలకు రూ.500 కోట్లు ఖర్చు చేశామని చెప్పిన ప్రభుత్వం, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకే రూ.23 కోట్లు ఖర్చయినట్లు లెక్కలు చూపించింది. వరద బాధితులకు అందించిన సహాయం ఎంత, వాహనాలు కోల్పోయిన వారికి ప్రకటించిన పరిహారం ఎంతమందికి అందిందో చెప్పాలి. తుపాను హెచ్చరికలు వచ్చినా బాధిత ప్రాంతాల్లో సమర్థంగా సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నారు. సమీక్షలు, ఫొటోలు, వీడియోలతో సరిపెట్టకుండా ప్రజలకు తక్షణ సహాయం అందించాలి. చంద్రబాబు, నారా లోకేష్‌ రాజకీయ ప్రచారాన్ని పక్కనపెట్టి బాధితుల సమస్యలపై దృష్టి పెట్టాలి.

- తుపాను నష్టపరిహారాన్ని ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలి:

వైఎస్‌ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఎకరానికీ ఈ-క్రాప్‌ నమోదు చేసి, రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశాం. 2019–2024 మధ్య ఈ ప్రాంతంలోనే ఎకరానికి రూ.23 వేల నుంచి రూ.29 వేల వరకు బీమా పరిహారం అందించిన చరిత్ర మా ప్రభుత్వానిది. పంట నష్టపోయిన రైతులకు తదుపరి పంట సీజన్‌లోపు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాం. నేడు కూట‌మి  ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా లేదు, ఇన్‌పుట్‌ సబ్సిడీ సకాలంలో అందడం లేదు. ప్రభుత్వం తన వాటా ప్రీమియం చెల్లించకపోవడంతో ప్రీమియం కట్టిన రైతులు కూడా నష్టపోయారు. పాత ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలతో పాటు తాజా తుపాను నష్టపరిహారాన్ని ఎప్పటిలోగా చెల్లిస్తారో ప్రకటించాలి. సుమారు 8.30 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే, అందులో 7.60 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు చెబుతున్న ప్రభుత్వం వరి రైతులకు పరిహారం ఎందుకు పెంచడం లేదు? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2023 నవంబర్‌ 14న జీవో నంబర్‌ 5 ద్వారా పెంచిన స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌ ప్రకారం వరి రైతులకు కూడా పరిహారం పెంచాలి. కౌలు రైతులను గుర్తించి, నష్టపోయిన ప్రతి రైతుకూ న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

- బాధితుల‌కు న్యాయ‌మైన ప‌రిహారం అందించాలి: 

తుపాను బాధితులకు నిత్యవసరాలు ఇస్తామని ప్రకటనలు చేయడం మాత్రమే సహాయక చర్యలు కాదు, బాధిత కుటుంబాల జాబితా, సహాయం అందించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించాలి. పడవలు, వలలు కోల్పోయిన మత్స్యకారులకు, విద్యుత్‌ అంతరాయాలు, చెరువులకు గండ్ల వల్ల నష్టపోయిన చేపలు, రొయ్యల రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఇంటింటికీ వైద్య సిబ్బందిని పంపించి పరీక్షలు, చికిత్స అందించాం, ఇప్పుడు కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి. కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో తుపాను కారణంగా క్షేత్రస్థాయి పరిశీలనకు ఆటంకం ఏర్పడినప్పుడు ఓటర్ల గుర్తింపు, అభ్యంతరాల స్వీకరణ షెడ్యూల్‌ను మార్చాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు, గ్రామాల విలీనం, వార్డుల పరిధి అంశాల్లో పారదర్శకత పాటించాలి. కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రజల అభ్యంతరాలను స్వీకరించిన తర్వాతే ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌సీపీ పోటీకి సిద్ధంగా ఉంది, కానీ ప్రజలు తుపాను బాధల్లో ఉన్నప్పుడు ఎన్నికలే ముఖ్యమన్నట్లు వ్యవహరించడం సరికాదు. చంద్రబాబు ప్రభుత్వం కాకి లెక్కలు మానేసి వాస్తవ నష్టాన్ని ప్రకటించి, ప్రతి రైతుకు, కౌలు రైతుకు, మత్స్యకార కుటుంబానికి న్యాయమైన పరిహారం అందించాలి. ప్రచార స్టంట్లకు స్వస్తి చెప్పి బాధితులను ఆదుకోవాలి, ప్రజలకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ వారి పక్షాన నిలబడి పోరాడుతుందని కుర‌సాల క‌న్న‌బాబు స్ప‌ష్టం చేశారు.

Back to Top