ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ.. హామీలకు తిలోదకాలు

కూటమి ప్రభుత్వ మోసానికి ఉద్యోగులే గుణపాఠం చెప్పాలి

నలమారు చంద్రశేఖర్ రెడ్డి పిలుపు

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎంప్లాయిస్‌ అండ్‌ పెన్షనర్స్‌ విభాగం రాష్ట్ర 
అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి. 

ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు మోసం చేస్తోంది?

పీఆర్సీ, మధ్యంతర భృతి, డీఏ బకాయిలు ఎప్పుడిస్తారు చంద్రబాబూ?  

ఉద్యోగులకు రావాల్సిన రూ.40 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించకుండా ఇంకా ఎంతకాలం కాలయాపన చేస్తారు?

నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతుంటే ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారు?

కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్, అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను గాలికొదిలేయడమేనా మీ పాలన?

నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి నిలదీత

తుఫాను సహాయక చర్యల్లో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 కోట్ల చొప్పున పరిహారం 
చెల్లించాలి

రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగులను బెదిరించడం ఏమిటి? ఎన్నికల విధుల్లో పక్షపాతానికి పాల్పడటం 
తక్షణమే ఆపాలి

నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి డిమాండ్‌

ఉద్యోగులారా మేల్కోండి

హామీలను విస్మరించిన కూటమి సర్కార్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పండి.

మీడియా సమావేశంలో నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి పిలుపు

తాడేపల్లి: ఎన్నికల ముందు ఉద్యోగుల ఓట్ల కోసం హామీల వర్షం కురిపించి, అధికారంలోకి వచ్చాక వారి సమస్యలను గాలికొదిలేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని వైయస్‌ఆర్‌సీపీ ఎంప్లాయీస్‌ అండ్‌ పెన్షనర్స్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. పీఆర్సీ, మధ్యంతర భృతి, డీఏ బకాయిలను పెండింగ్‌లో పెట్టి, ఉద్యోగులకు రావాల్సిన రూ.40 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ, ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యోగులే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు.
ప్రెస్‌మీట్‌లో నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఏమన్నారంటే ..

- పీఆర్సీ, మధ్యంతర భృతి ఎప్పుడు?

    ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లు దాటినా ఆ హామీని నెరవేర్చలేదు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చింది. ఇప్పుడు ఉద్యోగులకు 30 శాతానికి తగ్గకుండా మధ్యంతర భృతి ప్రకటించాలి. పెండింగ్‌లో ఉన్న మూడు విడతల డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. 2023 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీని ఇంకా ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారు? ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఇకనైనా వెంటనే అందించాలి. 

- ధరలు పెరుగుతున్నా ఉద్యోగులకు ఊరట ఏదీ?

    బియ్యం, వంటనూనె, పప్పులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. 25 కిలోల బియ్యం బస్తా ధర రూ.2,400 నుంచి రూ.2,500కు చేరింది. వంటనూనె, చక్కెర, కందిపప్పు ధరలు కూడా భారీగా పెరిగాయి. నిత్యావసర ధరలను నియంత్రించకుండా, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ, బకాయిలు చెల్లించకుండా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు, నోషనల్‌ ఇంక్రిమెంట్లు, సర్వీస్‌ ప్రయోజనాలు కల్పించాలి. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదు. 

- ఈహెచ్‌ఎస్‌ బకాయిలు చెల్లించి వైద్య సేవలు అందించాలి

    ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ప్రతి నెలా ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం చందాలు వసూలు చేస్తున్నారు. అయినా ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో చికిత్స పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉద్యోగులు తమ వాటా చెల్లించినప్పుడు ప్రభుత్వం కూడా తన వాటాను సకాలంలో చెల్లించాలి. ఆరోగ్య కార్డులు ఉన్నా వైద్యం అందని పరిస్థితి ఉండకూడదు. ఆసుపత్రులకు బకాయిలు వెంటనే చెల్లించి ఉద్యోగులు, పెన్షనర్లకు నిరంతర వైద్య సేవలు అందించాలి. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ విషయంలో తగిన మినహాయింపు కల్పించాలి. 

- విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయాలి

    తుఫాను సహాయక చర్యల్లో ప్రాణాలు కోల్పోయిన సచివాలయ ఉద్యోగిని కలాం సరస్వతి, విద్యుత్‌ ఉద్యోగి పైడిరాజు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఒక్కొక్క కుటుంబానికి రూ.5 కోట్ల చొప్పున పరిహారం చెల్లించాలి. వారి కుటుంబాల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి అండగా నిలవాలి. ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. బాధిత కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలి. 

- ఉద్యోగులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు
    
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ పిలిచి, బీజేపీ మేయర్‌ అభ్యర్థికి ఓటు వేయకపోతే ఉద్యోగాలు పోతాయని బెదిరించినట్లు వచ్చిన వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగులను రాజకీయ ప్రయోజనాల కోసం బెదిరించడం ఎంతవరకు సమంజసం? ఉద్యోగ భద్రతను రాజకీయ మద్దతుతో ముడిపెట్టడం అన్యాయం. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కర్నూలు జిల్లా ఆలూరులో హోంగార్డు భార్య ఎంపీటీసీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఒత్తిళ్లు తెచ్చి, హోంగార్డును బదిలీ చేసినట్లు వచ్చిన వ్యవహారంపైనా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు రాజకీయాల్లో పాల్గొనే హక్కు ఉంది. ఆ హక్కును అడ్డుకునే ప్రయత్నాలను సహించకూడదు. 

- ఉద్యోగులారా మేల్కోండి
    
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయాలి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా, ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఉద్యోగులారా మేల్కోండి. హామీలను విస్మరించిన కూటమి సర్కార్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పండి అని నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Back to Top