ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో దోపిడీ పాలన

ప్రజలు ముందుచూపుతో ఆలోచించి ఓటు వేయండి

వైయ‌స్‌ఆర్‌సీపీని గెలిపిస్తే ప్రజలకు తోడుగా ఉంటాం

అనంతపురం నగర అభివృద్ధి వైసీపీతోనే సాధ్యం

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి

మేయర్‌ అభ్యర్థి రమేష్‌గౌడ్‌తో కలిసి 61, 62, 60, 58 డివిజన్లలో ప్రచారం

ఫ్యాన్‌గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన

అనంతపురం  : జిల్లా కేంద్రమైన అనంతపురం నగరంలో రెండున్నరేళ్లుగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ఆధ్వర్యంలో దోపిడీ పాలన సాగుతోందని వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీని గెలిపిస్తే ప్రజలకు జవాబుదారీగా తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. గురువారం వైఎస్‌ఆర్‌సీపీ మేయర్‌ అభ్యర్థి రమేష్‌గౌడ్‌తో కలిసి నగరంలోని 61, 62, 60, 58 డివిజన్లలో వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు వాసంతి, బిందుప్రియ, సుజాత, భవాని తరఫున ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందించి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ అనంతపురం ప్రజలు విజ్ఞతతో ముందుచూపుతో ఆలోచించి మేయర్‌ అభ్యర్థి రమేష్‌గౌడ్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పరిపాలన ఎలా సాగిందో గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడంతో పాటు నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లామన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, అనుచరులు దోపిడీ చేస్తున్న వైనాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రజలంతా కలిసికట్టుగా నగరాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీని గెలిపిస్తే దుర్మార్గుల నుంచి, దౌర్జన్యకారుల నుంచి ప్రజలను రక్షిస్తామన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని ఎద్దేవా చేశారు. తమను గెలిపిస్తే నగర ప్రజలకు మౌలిక సదుపాయాలను మరింత చేరువ చేస్తామని అనంత భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక హామీల అమలులో వైఫల్యం చెందిందన్నారు. నగరంలో ఒక్క కొత్త పింఛన్‌ ఇవ్వకపోగా 1300 పింఛన్లను తొలగించినట్లు చెప్పారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్‌ అనేవి మోసపూరిత హామీలుగానే నిలిచిపోయాయని విమర్శించారు. బీసీ కులానికి చెందిన విద్యావంతుడైన రమేష్‌గౌడ్‌ను మేయర్‌ అభ్యర్థిగా నిలబెట్టామని, ఆయనతో పాటు అన్ని డివిజన్లలో వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజలు ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి అనంతపురం నగరం అభివృద్ధికి సహకరించాలని కోరారు.

Back to Top