కూటమి అరాచకాలను ఎండగట్టండి.. 

సోషల్ మీడియా సైనికులు ప్రజల్లోకి వెళ్లాలి

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పిలుపు

విజయవాడ: వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు నడికట్టు రమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి ప్రభుత్వ నిధులను దుబారా ఖర్చులకు వినియోగిస్తున్నారని ఆరోపించారు.

మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు చేరాయని, ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత పాలకులు అబద్ధపు హామీలు, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటి అమలును కాలయాపన చేస్తూ ప్రజలను వంచిస్తున్నారని ధ్వజమెత్తారు. 
కూటమి ప్రభుత్వ హామీల అమలులో వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విస్తృతంగా వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ తప్పిదాలు, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సోషల్ మీడియా వేదికలను సమర్థవంతంగా వినియోగించి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
 

Back to Top