పంటల బీమా ప్రీమియం గడువు పొడిగించాలి 

 జూలై 15 నుంచి కనీసం జూలై 31 వరకు అవకాశం కల్పించాలి: ఎం.వి.ఎస్. నాగిరెడ్డి 

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ ఆధారిత పంటల బీమా (Weather Based Crop Insurance) ప్రీమియం చెల్లింపు గడువును జూలై 15 నుంచి కనీసం జూలై 31 వరకు పొడిగించాలని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే భారీగా వర్షపాతం లోటు నమోదవడంతో రైతులు ఇంకా పూర్తిస్థాయిలో సాగు చేపట్టలేకపోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో బీమా గడువు ముగియడం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.

ఎం.వి.ఎస్. నాగిరెడ్డి మాట్లాడుతూ, జూన్ 1 నుంచి జూలై 14 వరకు రాష్ట్రంలో సగటున 45.1 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు నమోదైందని, నాలుగు జిల్లాల్లో 60 శాతానికి పైగా, మిగిలిన జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వరకు వర్షాభావం ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వర్షాధార పంటలైన పత్తి, వేరుశనగ సాగు తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పారు.
గత వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడం వల్ల రైతులు ఇప్పటికే నష్టపోయారని, ఇప్పుడు స్వచ్ఛంద బీమా ప్రీమియం చెల్లించాలంటూ ప్రభుత్వం సూచించడం రైతులపై అదనపు భారం మోపినట్లేనని విమర్శించారు. ప్రస్తుతం పత్తి సాగు సాధారణ విస్తీర్ణంలో 47 శాతం, వేరుశనగ సాగు కేవలం 12 శాతం మాత్రమే పూర్తైందని గుర్తు చేశారు. వర్షాలు ఆలస్యమైతే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని, అందువల్ల బీమా గడువు పొడిగించడం అత్యవసరమని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాతావరణ ఆధారిత పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును కనీసం జూలై 31 వరకు పొడిగించి, ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులకు ఎం.వి.ఎస్. నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
 

Back to Top