నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించి, 'రెడ్ బుక్' రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని వైయస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ దారుణంపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించే వరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనీస జ్ఞానం కూడా లేకపోయిందని మండిపడ్డారు. వైయస్. జగన్ పర్యటనకు భయపడే చంద్రబాబు బాధితులను పిలిపించుకుని డ్రామాలు ఆడుతున్నారని, నా కొడుకును చంపేశారని ఒప్పుకుంటూ ఆ తల్లి కాళ్లు పట్టుకుని చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోగి రమేష్ సహా తనపై 27 అక్రమ కేసులు పెట్టి కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకంలో లబ్ధిదారులను కుదించి, కౌలు రైతులను ముంచేసి చంద్రబాబు రైతు వ్యతిరేకిగా మారారని, రాబోయే రోజుల్లో ఈ రాక్షస పాలనకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని కాకాణి హెచ్చరించారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వాలు మారవచ్చు కానీ, వ్యవస్థలు మాత్రం పక్షపాతం లేకుండా తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని హితవు పలికారు. అయితే నేడు ఏపీలో తమకు నచ్చని వారిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే రాజకీయ ప్రత్యర్థులను ఎలా అరెస్ట్ చేయాలి, ఏ విధంగా థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టాలి, చివరికి లాకప్ డెత్ పేరిట ఎలా హత్య చేయాలనే ఏకైక అజెండాతో పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. అక్రమ కేసులు - పీటీ వారంట్ల కుట్రల కుటీర పరిశ్రమ.. కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలను జైళ్లోనే ఉంచడానికి అనేక రకాల కుట్రలను పన్నుతోంది. ప్రభుత్వాన్ని నిలదీసే వారిపై పాత కేసులు ఉంటే తిరగదోడుతున్నారు.. లేకపోతే కొత్తగా తప్పుడు కేసులను సృష్టించి బనాయిస్తున్నారు. సాక్ష్యాలు లేకపోతే టీడీపీ సానుభూతిపరులనే సాక్షులుగా కోర్టుల ముందు నిలబెడుతున్నారు. కోర్టులలో ఈ అక్రమ కేసులు నిలబడవని వీరికీ తెలుసు. అందుకే, న్యాయస్థానం ఒక కేసులో బెయిల్ ఇచ్చే సమయానికి, మరో అక్రమ కేసులో పీటీ (PT) వారంట్ వేసి నిందితులను జైలు నుంచి బయటకు రాకుండా నెలల తరబడి వేధిస్తున్నారు. పిన్నెల్లి సోదరులపై కక్షసాధింపు: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిలను అక్రమంగా రెండు నెలలు జైల్లో పెట్టారు. టీడీపీలోని రెండు వర్గాల అంతర్గత విభేదాల వల్లే ఆ హత్య జరిగిందని సాక్షాత్తూ జిల్లా ఎస్పీనే ప్రకటించినా.. ఆ నిజాన్ని పక్కనబెట్టి పిన్నెల్లి సోదరులను కేసులో ఇరికించి వేధించారు. ఈ రెండేళ్ల కూటమి పాలనలో నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా ఏకంగా 27 అక్రమ కేసులు నమోదు చేశారు. ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును ఫార్వార్డ్ చేసినా కేసు పెడుతున్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు సిట్ డీఎస్పీ, సీఐడీ డీఎస్పీ, బాపట్ల, ఒంగోలు రూరల్ అధికారులు క్యూ కట్టి మరీ నోటీసులు ఇచ్చారంటే వ్యవస్థలు ఎంతలా కుప్పకూలిపోయాయో అర్థమవుతోంది. జోగి రమేష్, జర్నలిస్టులు, మేధావులపై అణచివేత.. టీడీపీ నేతలు అడ్డగోలుగా నడిపిస్తున్న 'నకిలీ మద్యం' కుటీర పరిశ్రమను అడ్డంగా పట్టించినందుకు మాజీ మంత్రి జోగి రమేష్‌ను కేసులో ఇరికించడమే కాకుండా, వారి ఇంటిపై దాడులు చేసి ధ్వంసం చేశారు. దళిత యువ వైద్యుడు శ్రీకాంత్ ఒక వాలంటీర్ కుటుంబానికి అండగా నిలిచినందుకు అతనిపై కేసులు పెట్టారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడులు చేశారు. డీసీఎంఎస్ (DCMS) అధ్యక్షుడు వి. చలపతిపై పాత కేసును తిరగదోడి, ఏ సెక్షన్లు పెడితే ఎక్కువ కాలం జైల్లో ఉంచవచ్చో చూసుకుని మరీ లోపల వేశారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడానికి వెళ్లిన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి, అనారోగ్యంతో ఉన్నా మూడు నెలలు జైల్లో పెట్టారు. దీనిపై మాజీ ఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి హైకోర్టులో సాక్ష్యాలు చూపాకే నిన్న బెయిల్ వచ్చింది. జర్నలిజంలో లెజెండ్ లాంటి కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమంగా కేసులు పెట్టారు. పోసాని మురళి పాత కేసును తిరగదోడి రాష్ట్రంలోని జైళ్లన్నీ తిప్పి హింసించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావును సైతం వదలకుండా వేధించారు. జగన్ పరామర్శించాకే చంద్రబాబుకు జ్ఞానోదయం.. విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్ డెత్, పేరుపోగు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో ఆత్మహత్యలపై చంద్రబాబు, హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. సాయికృష్ణను మార్కాపురం నుంచి పట్టుకొచ్చి హోటల్‌లో చిత్రహింసలు పెట్టి చంపేస్తే.. మొదట సీఐ నాగరాజును వీఆర్‌కు పంపి చేతులు దులుపుకున్నారు. కానీ వైయస్సార్సీపీ శ్రేణులు నిలదీసి, నిన్న మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్వయంగా బాధిత తల్లిని పరామర్శించాకే చంద్రబాబుకు జ్ఞానోదయం అయింది. జగన్ గారు వెళ్లాకే భయపడి కేసు నమోదు చేసి, ఆ తల్లిని సీఎం ఆఫీసుకు పిలిపించుకుని మాట్లాడారు. ఈ విషయంలో చంద్రబాబుకు వైయస్ జగన్ మార్గదర్శిగా నిలిచారు. కాళ్లు పట్టుకుని క్షమాపణ వేడుకో: "చంద్రబాబూ.. మీరు ఆ తల్లి చేతులు కాదు.. కాళ్లు పట్టుకుని క్షమాపణ వేడుకోవాలి. మీ 'రెడ్ బుక్' రాజ్యాంగం, మీ పోలీసుల వల్లే కొడుకును కోల్పోయానని ఒప్పుకోవాలి." సీఐ నాగరాజు వేధింపుల వల్లే చనిపోతున్నానని దళిత యువకుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకున్నా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. హోంమంత్రి అనితకు కేవలం వైయస్సార్సీపీ నేతలను తిట్టడానికే పదవి ఇచ్చినట్లున్నారు. ఎవరైనా తిరిగి ప్రశ్నిస్తే 'మహిళా కార్డు' తెరపైకి తెస్తారు. ఈ దారుణాలకు ముఖ్యమంత్రి, లోకేష్, హోంమంత్రిలలో ఎవరు నైతిక బాధ్యత వహిస్తారో చెప్పాలి. కృష్ణపట్నం గస్తీ బోట్ల మాయం.. మత్స్యకారులకు చంద్రబాబు ద్రోహం కావలి వచ్చి మంట లేకుండా వంట చేయడం నేర్పించిన రాగాల చంద్రబాబు.. తీరంలో గస్తీ బోట్లు పెడుతున్నానని డబ్బా కొట్టుకుంటున్నారు. గతంలో టీడీపీ నేత బీదా మస్తాన్ రావు వ్యవహారంతో రెండు బోట్లు మాయమయ్యాయి. ఇటీవల తమిళనాడుకు చెందిన ఫిషింగ్ బోట్లను కృష్ణపట్నం గస్తీ బృందం పట్టుకుని జువ్వలదిన్నెలో పెడితే, మరుసటి రోజుకే ఆ బోట్లు మాయమైపోయాయి. పోలీసులు, ఫిషింగ్ సిబ్బంది లోపాయికారీ ఒప్పందాలతోనే ఆ బోట్లను వదిలేశారు. చంద్రబాబు చెప్పే మాటలకు, చేసే చేష్టలకు అస్సలు పొంతన లేదు. వీరికి కేవలం అనుకూల పచ్చ మీడియాలో బాకాలు ఊదించుకోవడం తప్ప మత్స్యకారుల సంక్షేమం పట్టదు. 'అన్నదాత సుఖీభవ'కు చంద్రబాబు భారీ గండి.. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైయస్ జగన్ పనిచేస్తే.. చంద్రబాబు తన నైజానికి తగ్గట్టుగా రైతులకు కోతలు పెట్టి 'రైతు వ్యతిరేకి'గా ముద్రపడ్డారు. వైయస్ జగన్ హయాంలో 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందితే.. కూటమి ప్రభుత్వం ఆ సంఖ్యను కేవలం 46,85,939 మందికే కుదించింది. అర్హులైన వారిలో 10 శాతం మందికి ఇప్పటికీ సాయం అందక కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రతి రైతుకు ఏటా రూ. 20 వేలు ఇస్తామని చెప్పి చంద్రబాబు మొదటి ఏడాది మొత్తం ఎగ్గొట్టారు. రెండో ఏడాది కేంద్ర నిధులతో కలిపి కేవలం రూ. 14 వేలు ఇచ్చారు. ఇప్పుడు మూడో ఏడాది కేంద్రం ఇచ్చే రూ. 2 వేలతో కలిపి కేవలం రూ. 7 వేలు మాత్రమే ఇస్తూ దగా చేస్తున్నారు. కౌలు రైతులను ఈ పథకం నుంచి పూర్తిగా దూరం చేశారు. పథకాలకు మంగళం: రాష్ట్రంలో సున్నా వడ్డీ పథకం లేదు, ఉచిత పంటల బీమా లేదు, పంట నష్టానికి ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. వీటన్నింటికీ చంద్రబాబు పూర్తిగా మంగళం పాడారు. రైతులకు కోతలు పెడుతున్న చంద్రబాబుకు రాబోయే రోజుల్లో అన్నదాతలు వాతలు పెట్టడం ఖాయం. వైయస్ జగన్'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమానికి పిలుపునిస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. చంద్రబాబు మాత్రం అధికారులను వాడుకుని డ్వాక్రా మహిళలను, వీఆర్వోలను బలవంతంగా తరలించి సభలు పెడుతున్నారన్నారు. "మీ పక్కన ఉన్నవారంతా ప్యాకేజీ బ్యాచ్.. కింద కూర్చుని చప్పట్లు కొట్టే వారంతా పేమెంట్ బ్యాచ్.. వీరిని పెట్టుకుని బ్రహ్మాండమైన పాలన అని చంద్రబాబు భ్రమపడుతున్నారు". రాష్ట్రంలో గ్రావెల్, ఇసుక, మద్యం మాఫియాలు, బెట్టింగులు, పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా నడుస్తున్నా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అరాచకాలు, కక్షసాధింపులు మానేసి ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబుకు, ఆయనకు భజన చేసే పచ్చ మీడియాకు ఏపీ ప్రజలు కోలుకోలేని ఎదురుదెబ్బ కొట్టడం ఖాయమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.